ఉదయం 7 గంటల వేళ, డాల్టన్‌గంజ్ పట్టణంలోని సాదిక్ మంజిల్ చౌక్ అప్పటికే కోలాహలంగా ఉంది. బొబ్బరిస్తోన్న ట్రక్కులు, షట్టర్లను పైకి లేపుతున్న దుకాణాలు, దగ్గరలోనే ఉన్న ఒక గుడి నుంచి వినిపిస్తోన్న రికార్డ్ చేసిన హనుమాన్ చాలీసా.
ఒక దుకాణం మెట్ల మీద సిగరెట్ తాగుతూ కూర్చొని ఉన్న ఋషి మిశ్రా చుట్టుపక్కల ఉన్నవారితో పెద్ద గొంతుతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయం వారి చర్చలన్నీ ఈ మధ్యనే ముగిసిన సార్వత్రిక ఎన్నికల గురించి, ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు అనే విషయం చుట్టూనే తిరుగుతున్నాయి. రెండు అరచేతుల మధ్యన పొగాకును రుద్దుతూ, తన చుట్టూ ఉన్నవారి వాదనలన్నీ వింటోన్న నజరుద్దీన్ అహ్మద్ చివరికిలా జోక్యం చేసుకున్నారు,"ఎందుకు మీరు వాదులాడుకుంటున్నారు? ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేసినా, మన జీవనం కోసం మనం సంపాదించుకోవాల్సిందే కదా."
ప్రతి రోజూ ఉదయం పూట ‘లేబర్ చౌక్’ అని కూడా పిలిచే ఈ ప్రదేశంలో గుమిగూడే అనేకమంది దినసరి కూలీలలో ఋషి, నజరుద్దీన్లు కూడా ఉన్నారు. పలామూ చుట్టుపక్కల ఊళ్ళలో పనులేమీ దొరకటంలేదని వారు చెప్తున్నారు. దాదాపు 25-30 మంది కూలీలు ఇక్కడి సాదిక్ మంజిల్ లేబర్ చౌక్ (జంక్షన్) వద్ద రోజువారీ కూలీ పని కోసం వేచి ఉన్నారు. పట్టణంలోని ఇటువంటి ఐదు చౌక్‌లలో ఇది కూడా ఒకటి. ఝార్ఖండ్‌లోని సమీప గ్రామాల ప్రజలు ప్రతిరోజూ ఉదయం ఈ చౌకులకు వచ్చి పని కోసం వెతుక్కుంటారు.








