కాదేర్ అలీ ఇంకెప్పుడూ నాతో మాట్లాడలేరు.
నవంబర్ 2025లో, నేను చివరిసారి అతన్ని కలిసినప్పుడు అతి కష్టం మీద నాతో మాట్లాడగలిగారు. ఆ చిన్న రేకుల ఇంట్లో, అతని బలహీనమైన దగ్గు శబ్దం మాత్రమే గరగరమని వినిపించింది. ఇంటి ముంగిట్లో, కొన్ని కోడిపిల్లలను తరుముతోన్న ఒక పుంజు చేస్తున్న శబ్దం కూడా అశుభంగా తోచింది. ఇంటి లోపల, మంచంపట్టి ఉన్న కాదేర్, ఆ చెక్క మంచం మీద ఎటూ కదలలేని పరిస్థితిలో చాలా దారుణంగా కనిపించారు.
అంతకుముందు అతను సహాయం లేకుండా నడవగలిగేవారు. గుర్తున్న గత విషయాలను గురించి తన బలహీనమైన స్వరంతో కొంచెం కొంచెం మాట్లాడగలిగేవారు. కానీ నవంబర్ నాటికి అతను పూర్తిగా మంచం పట్టారు. అతని పక్షవాతం తీవ్రమవడంతో చేతులు కదపలేని పరిస్థితి వచ్చింది. స్పృహలోనే ఉన్నప్పటికీ, తాను పుట్టిన భూమిలో జీవించే హక్కు కోసం ఇన్నాళ్ళూ ధైర్యంగా పోరాడినట్టే తన ప్రాణాల కోసం కూడా పోరాడుతున్నారు.
“సుమారు పదిహేను రోజుల క్రితం అతనికి జ్వరం వచ్చింది. ఆయన శరీరంలో రక్తం శాతం పడిపోతూ ఉంది.” కాదేర్ కొడుకు, 33 ఏళ్ళ షహిదుల్ ఇస్లామ్, అసొమ్లోని గమారీగురీ గ్రామంలో ఉన్న వారి ఇంటి వరండాలో నిలబడి మాతో మాట్లాడుతున్నారు. “ఇప్పుడాయన తినలేకపోతున్నాడు. మాట్లాడలేకపోతున్నాడు. కదలలేకపోతున్నాడు. ఇంకా ఎంతకాలం మా మధ్య బతికుంటాడో మాకు తెలియటంలేదు,” అన్నారతను.
కాదేర్ స్పృహలోనే ఉన్నారు. ఏదో ఆశను పట్టుకున్నవాడిలా, పూర్తిగా కళ్ళు తెరిచి చూస్తున్నారు. అయితే, ఆ ప్రయత్నం అతని ఇంటికి ఉన్న ఒకే ఒక్క తలుపు గుండా, అలాగే రేకుల పైకప్పులోని చిన్న పగులు గుండా లోపలికి ప్రవేశించిన సూర్యుని చివరి కిరణాలలా క్షణికంగా మారింది.
మేం చూసివచ్చిన కొన్ని రోజులకే, 2025 నవంబర్ 18న కాదేర్ మరణించారు. ఆయన వయసు 66 ఏళ్ళు.











