నాగాలాండ్ సరిహద్దులో ఉన్న అసొమ్లోని జోర్హాట్ జిల్లాలో, పొహుకోతియా శ్యామ్ అనే ఒక అందమైన చిన్న టాయ్ తురుంగ్ గ్రామం ఉంది. దీనిని అధికారిక రికార్డులలో* తిపోమియా హబీ గాఁవ్ అని పిలుస్తారు. వంపులు తిరిగి ఉండే పాత మట్టి రోడ్లు, చిక్కని పచ్చదనం, చిన్న తోటలు, పాతబడిన వెదురు కంచెలతో కూడిన సంప్రదాయ చాంగ్ ఘర్లు (మరగాళ్ళపై కట్టిన ఇళ్ళు) ఈ గ్రామపు పురాతన ప్రకృతి చిత్రాన్ని కళ్ళకు కడతాయి. ఈ గ్రామంలో నివసిస్తోన్న 77 ఏళ్ళ రైతు అనంత తురుంగ్, తన మాతృభాష టాయ్ తురుంగ్లో ఒక ప్రత్యేకమైన 'పదాల భాండాగారాన్ని' నిర్మిస్తున్నారు.
"భాష నీటిలాంటిది, అది ఒక ప్రవహించే నది – అది ఎప్పటికీ ఒకేలా ఉండదు. కానీ అది అకస్మాత్తుగా మారిపోయి అంతరించిపోకూడదు," అని ఆయన అంటారు. ఈ దృఢ విశ్వాసంతోనే ఈ సన్నకారు రైతు తన మాతృభాషను నమోదు చేయడానికి ఐదు దశాబ్దాలకు పైగా అంకితమయ్యారు. తన తురుంగ్ తెగ మూలాలను పరిశోధించడం, పదాలను సేకరించడం, వాటి వ్యుత్పత్తి, వ్యాకరణం, మారుతున్న రూపం, వాడుక వంటివాటిపై బహుళ వలసల, సాంస్కృతిక సమ్మేళనాల ప్రభావాన్ని అర్థం చేసుకోవడం; వీటి గురించి పుస్తకాలలో, పత్రికలలో, వార్తాపత్రికలలో రాయడం వంటి పనులను ఆయన చేశారు.
తనకున్న 5 బిఘాల (1.6 ఎకరాల) భూమి నుండి వచ్చే కొద్దిపాటి ఆదాయాన్ని సొంతంగా ఖర్చుపెట్టి, ఇదంతా ఆయన సంపాదించుకున్నారు. ఒక వెంచర్ పాఠశాలలో 'అనధికారిక' ఉపాధ్యాయుడిగా, నిర్వాహకుడిగా 40 ఏళ్ళకు పైగా చేసిన సేవకు ఆయనకు ఎన్నడూ జీతం రాలేదు. చివరకు ఆ బడికి ప్రభుత్వ సహాయ నిధి అందే సమయానికి, ఆయనకు గుమస్తా జీతానికి అర్హత లభించింది. అయితే, అప్పటికే ఆయన పదవీ విరమణకు కేవలం మూడు నెలల దూరంలో ఉన్నారు. కానీ తన భాషను కాపాడాలనే ఆయన లక్ష్యానికి ఇవేవీ అడ్డురాలేదు.










