బిహార్‌లోని దర్భంగా జిల్లా, తార్డీ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీల కుమారుడైన లాల్ సింగ్ 1997లో ముంబైకి వస్తారు. ఇల్లంటే పేదరికం, పోరాటం. అయితే ముంబైకి నగరపు వెలుగుజిలుగులున్నాయి. భారతదేశమంతటా గ్రామాల నుండి పట్టణాలకు వలస వచ్చిన 2.1 కోట్ల మంది వలసదారులలో అతనూ ఒకరు. అదేవిధంగా ఆ దశాబ్దంలో కేవలం ఒక్క ముంబైకి మాత్రమే వలసవెళ్ళిన 25 లక్షల మందిలో కూడా అతను ఒకరు. వీరంతా జీవనోపాధి కోసం వెతుక్కునేవారే. అతను సెక్యూరిటీ గార్డుగా, ఫ్యాక్టరీలో కూలీగా, ఆఫీస్ బాయ్‌గా, కుక్కలను నడవటానికి బయటకు తీసుకువెళ్ళేవాడిగా, వంటవాడిగా పనిచేస్తారు. కానీ అతనికి నగరంలో ఒక కొత్త అభిరుచి, ఒక కొత్త కల దొరికాయి. నటన, రచనల పట్ల తనకు ప్రేమ ఉన్న విషయాన్ని అతను తెలుసుకుంటారు.
లాల్ సింగ్ జీవనోపాధి కోసం రకరకాల పనులు చేస్తూ 28 ఏళ్ళుగా ముంబైలో తన రోజులను గడుపుతున్నారు. అయితే తెరవెనుక ఆయన ఇప్పటికీ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ, తన సృజనాత్మక స్వప్నాలను పెంచిపోషించుకుంటూనే ఉన్నారు. ఇది లాల్ సింగ్ గురించీ, ఆయన సుదీర్ఘ ప్రయాణం గురించీ భయపెట్టినప్పటికీ, స్ఫూర్తిదాయకమైన కథ.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి


