మే 15, 2026న నా రోజువారీ పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక ఆందోళనకరమైన వార్త నన్ను ఒక్కసారిగా ఆగిపోయేలా చేసింది. గుజరాత్‌లోని సూరత్‌లో ఒక చీరల ప్యాకేజింగ్ యూనిట్ నుండి 93 మంది పిల్లలను రక్షించారనేది ఆ వార్త. అబ్బాస్ కూడా వారిలో ఒకడై ఉంటే బాగుండునని నేను కోరుకున్నాను.
మసక వెలుతురుతో, గాఢమైన నారపీచు వాసనతో బూజులు నిండివున్న ఒక గదిలో, నేనొక బలహీనంగా ఉన్న బాలుడి పక్కన కూర్చున్నాను. ఒక పొలం, ఎగురుతున్న పక్షుల జటిలమైన నమూనాల జాదలను అతను బంగారు రంగులో ఉన్న లోహపు దారాలను ఉపయోగించి కడ్డీ కుట్టు కుడుతున్నాడు. కొయ్య చట్రానికి సాగదీసి బిగించిన చీరపై ఉన్న ఆ నమూనాలకు సీక్విన్లు, పూసలు, కొన్ని విలువైన రాళ్ళను అమర్చేందుకు అతను ఒక సన్నని ఆరీ సూదిని ఊహకందని నేర్పుతో కదుపుతున్నాడు. అతని గోళ్ళ నిండా నిన్నటి మట్టి పేరుకుపోయి ఉంది.
గుంటలుపడిన విశాలమైన కళ్ళు, లాఘవంగా కదిలే పొడవాటి చేతివేళ్ళున్న అబ్బాస్, అప్పుడా గదిలో ఉక్కిరిబిక్కిరిగా చిక్కుకున్నట్టున్న మిగతా అందరిలాగే కనిపించాడు. ఈ జరీ చీరల తయారీ గదిలో జరిగే సున్నితమైన పనికి అటువంటి చేతివేళ్ళు సరిగ్గా సరిపోతాయని ఆ యూనిట్ యజమానులు చెప్పారు. నిశ్శబ్దంగా తల ఊపటం, ఒక పద్ధతి ప్రకారం అతని సూదులు చేసే కదలికలు తప్ప, అబ్బాస్ అందించేదేమీ లేదు. అతను మామూలు జీవితానికి పూర్తిగా అవతల సమయం, తేదీ, రోజు, సంవత్సరం వంటివేమీ తెలియకుండా జీవిస్తున్నాడు.
"నేను బడికి వెళ్ళాలని కలలు కనను," అన్నాడతను. నేను పట్టువదలకుండా మృదువుగా ప్రశ్నలడగటాన్ని కొనసాగించడంతో, "నేను గాలిపటాలు కూడా ఎగరేయను," గుసగుసగా చెప్పాడు. నిరుపేదదైన తన కుటుంబాన్ని అతనే పోషిస్తున్నాడు. రాత్రివేళల్లో తాను పగలంతా పనిచేసే ఆ ఫ్రేముల మధ్యనే నేల మీద గానీ, లేదంటే షట్టర్లకు బయట ఉన్న కాంక్రీట్ ఫుట్‌పాత్‌ల మీద గానీ పడుకుంటానని అతను నాకు చెప్పాడు. గాలి, వెలుతురు సరిగా లేని ఆ మురికోడుతున్న తయారీ గదికున్న బూడిద రంగు పైకప్పే అబ్బాస్‌కు ఆకాశం. అతను ఆ యూనిట్ నుండి ఎప్పుడైనా బయటకు అడుగు పెట్టాడని నాకనిపించలేదు.
కానీ అప్పటినించీ అబ్బాస్ నా ఆలోచనల్లో నాతో ప్రయాణిస్తూనే ఉన్నాడు. ఆ వార్తను చూడగానే వార్తలోని ముఖ్యాంశాలను ఒక పాటగా మలచాలని నాకనిపించింది. ఆ విషాదాన్ని గిటార్‌పై సి మైనర్ (C Minor) స్వరానికి అన్వయించాలని. కానీ ఆ రూపకం విఫలమైంది. నేనతన్ని కలిసిన రోజున ఇంటికి మోసుకొచ్చుకున్న పచ్చిగా, ఊపిరి సలపనంత బరువుగా ఉన్న అనుభూతిని అది వ్యక్తం చేయలేకపోయింది.


