నిరాహార దీక్షలు, 165 రోజుల పాటు ర్యాలీలు, రహదారి దిగ్బంధనాలు, ఎమ్మెల్యేలకు విజ్ఞాపన పత్రాలు, ‘మరణ’ ప్రదర్శనలు, మురుగునీటిలో మునకలు…
రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ చెన్నైలోని మున్సిపల్ కార్మికులు ఎన్నో రోజుల పాటు తీవ్రంగా ఆందోళన చేశారు. ఇది కేవలం ఒక నిరసన కాదు; నగరంలోని అత్యంత అణగారిన వర్గానికి చెందిన ప్రజలు నిశ్శబ్దంగా కనుమరుగవడానికి నిరాకరిస్తూ చేపట్టిన ఒక చారిత్రక పోరాటం.
2025 డిసెంబర్లో, సీనియర్ పారిశుద్ధ్య కార్మికురాలైన ఎం. మహాలక్ష్మి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లకు స్పందించకపోవడాన్ని తీవ్రమైన కుల వివక్షతో కూడుకున్న చర్యగా అభివర్ణించారు. “మేం 130 రోజులకు పైగా నిరసన తెలుపుతున్నా అటు నుండి ఎలాంటి స్పందనా లేదు. ఆలయ కార్మికులు నిరసన చేయకపోయినా వాళ్ళకు శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. అలాగే, నర్సుల డిమాండ్లను వారం రోజుల్లోనే నెరవేర్చారు. కానీ, మా దళిత పారిశుద్ధ్య కార్మికులు అదే గౌరవాన్ని కోరితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహిస్తోంది.”





















