దేవేశ్వరికి మధ్యాహ్నం 2 గంటలకల్లా బడి రోజు అయిపోతుంది కానీ ఆమె పని మాత్రం అయిపోదు. భుజానికి ఒక సంచి తగిలించుకొని, నూలు దుపట్టాతో తలను కప్పుకొని, 40 డిగ్రీల సెల్సియస్ ఎండలో ఆమె బయటకు అడుగుపెడతారు. ఇంటివైపుకు కాదు, కట్టెల కోసం. "నేను ఈ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిని," అంటారామె. "అయితే, నా విద్యార్థులకు తప్పనిసరిగా మధ్యాహ్న భోజనం అందేలా చూడటం కూడా నా పని. అందుకే నేను కట్టెల వేటకు వెళ్తున్నా."
లక్నో సరిహద్దులోని గ్రామీణ ప్రాంతమైన మాల్ బ్లాక్ పరిధిలోని రూదాన్ ఖేరాలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు 48 ఏళ్ళ దేవేశ్వరి నేగీ ఇన్చార్జ్ ఉపాధ్యాయురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ పాఠశాలలోని ఐదుగురు సిబ్బందీ మహిళలే; వీరిలో ఇద్దరు సహాయ ఉపాధ్యాయులు, పిల్లల కోసం మధ్యాహ్న భోజనాన్ని వండే ముగ్గురు వంటవారు ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకం కింద, ఉత్తర ప్రదేశ్‌లోని 1,41,000కు పైగా ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని కోటిన్నర మందికి పైగా విద్యార్థులకు తాజా, పోషకాలతో నిండిన భోజనం పొందేందుకు అర్హత ఉంది. దాదాపు ఈ పాఠశాలలన్నిటికీ ఎల్పిజి కనెక్షన్లను అందించారు. అయితే, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడి కారణంగా తలెత్తిన ఎల్పిజి సంక్షోభం, అత్యంత కీలకమైన ఈ పథకానికి అంతరాయం కలిగిస్తోంది. దీనివల్ల పెద్ద సంఖ్యలో పాఠశాలలు ప్రభావితమయ్యాయి, అయితే కచ్చితమైన సంఖ్యపై అధికారిక సమాచారమేదీ లేదు.
ఒక నెల రోజులుగా ప్రతి రోజూ బడి ముగిసిన తర్వాత దేవేశ్వరి, మిగిలిన నలుగురు సిబ్బంది తమ ఇళ్ళకు వెళ్ళటానికి బదులుగా వంటచెరకు కోసం వెతుకుతూ ఊరంతా తిరుగుతున్నారు. "మేం గ్యాస్ ఏజెన్సీని, స్థానికంగా కట్టెలు అమ్మేవారిని సంప్రదించి మా అదృష్టాన్ని పరీక్షించుకున్నాం. చివరకు గ్రామ ప్రధాన్‌కు కూడా విజ్ఞప్తి చేశాం, కానీ ఇంతటి కష్టకాలంలో ఎవరూ మాకు సాయం చేసే పరిస్థితిలో లేరు," నేగీ PARIతో చెప్పారు.
గతంలో సులభంగా లభించిన కట్టెలను ఇప్పుడు లక్నో నగర ప్రాంతం నుండి వచ్చే వ్యాపార కొనుగోలుదారులు కొనేసుకున్నారు. “మా దగ్గరున్న కట్టెల నిల్వలన్నింటినీ రెస్ట్రాంట్లకు, హోటళ్ళకు అమ్మేశాం. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సహాయం చేయాలనే కోరిక మాకు లేదని కాదు, కానీ అందరికీ సరిపడా కట్టెలు మా వద్ద లేవు," స్థానిక కట్టెల సరఫరాదారు ధర్మేశ్ యాదవ్ అన్నారు. మిగిలిన కొద్దిపాటి కట్టెలు మా రోజువారీ అవసరాలకే సరిపోతున్నాయి. లేకపోతే మేమేం తింటాం?”
విద్యార్థులు కూడా కట్టెలు సేకరణకు సహాయపడతారు. పాఠశాల పైకప్పుకు ఆనుకుని ఉండే చెట్ల నుండి వారు చిన్నా పెద్దా కొమ్మలను విరిచి తీసుకొస్తారు.










