కుల హింసను ప్రేరేపించటానికి ఆటలో ఒక దళిత జట్టు విజయం సాధించటం సరిపోతుంది. పరీక్షలు రాసేందుకు బస్సులో ప్రయాణిస్తోన్న దేవేంద్రరాజ్ను బస్ నుంచి బయటకు లాగి రోడ్డు మీద అతనిని నరికేశారు. అతని తండ్రి నాకీ విషయాన్ని చెప్పినప్పుడు, నా ఒళ్ళంతా ఒక వణుకు పుట్టింది. ఈ హింసంతా ఒక ఆట గురించి కాదు, అది ఒక ఆధికారం గురించి. ఈ క్రూరమైన దాడి వెనుక ఉన్నది, ఒక దళిత విద్యార్థి ఆధిపత్య కులాలకు చెందినవారిపై గెలవకూడదనే ఆలోచనే. విచిత్రమేమిటంటే, దేవేంద్రరాజ్ తన ప్రాంతంలో అత్యుత్తమ కబడ్డీ క్రీడాకారులలో ఒకరిగా ప్రసిద్ధి చెందాడు.
అతని తల మీద, చేతుల మీదా లోతుగా నరికిన గాయాలున్నాయనీ, అందులో ఒకటి చాలా తీవ్రమైనదనీ డాక్టర్ నాతో చెప్పారు. పాక్షికంగా తెగిపోయిన అతని వేళ్ళ గాయాలు నయం కావటానికి రెండుమూడు నెలలు పడుతుంది. "ప్లాస్టిక్ సర్జరీ చేయటానికి ముందు అతని వేళ్ళు సరిగా అతుక్కోవాలి," డాక్టర్ చెప్పారు.
దేవేంద్రరాజ్ అతని తల్లిదండ్రులకు పెద్ద కొడుకు. "నేను ఒక ఇటుక బట్టీలో పనిచేస్తాను. నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద కొడుకైన దేవేంద్రరాజ్ పాళయంకొట్టై లోని ఒక బడిలో చదువుతున్నాడు. నా కూతురు నా రెండవ సంతానం. నేనూ నా భార్యా రోజూ ఇటుక బట్టీకి వెళ్తాం," అన్నారు తంగ గణేశ్.
తన సొంత జీవితం గురించి ఆయన నింపాదిగా చెప్పుకుపోయారు: "నా చిన్నతనంలో నాకు కులం గురించి ఎరుక లేదు. మా టీచర్లెవరూ అంబేద్కర్ గురించి గానీ పెరియార్ గురించి గానీ చెప్పేవాళ్ళు కాదు. పదో తరగతి పరీక్షలు రాసిన తర్వాత, మాకున్న ఆర్థిక ఇబ్బందుల వలన, మోటార్ మెకానిక్స్ నేర్చుకోవటం కోసం నేను ఐటిఐ (వొకేషనల్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్)కి దరఖాస్తు చేశాను. అందులో చేరటానికి రూ. 650 కట్టాలి, అది ఏర్పాటు చేసుకోవటం కూడా కష్టమే. మా అమ్మ వేరేవాళ్ళ నుంచి అప్పు తీసుకుంది.
"ఆ డబ్బు పట్టుకొని నేను బాగా నేర్చుకోవాలనే ఆతృతతో, ఎన్నో కలలతో అక్కడికి వెళ్ళాను. కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి అధికారులు ఇద్దరి ముగ్గురి పేర్లను పిలిచి, ఇక్కడ సీట్లు లేవని చెప్పారు. అందులో నేనూ ఒకడిని. వాళ్ళు మమ్మల్ని బయటకు తోసి, గేట్లకు తాళం వేసుకున్నారు. ఇదంతా ఎందుకో నాకు అర్థంకాలేదు. నేను ఆ గేటు ముందే ఏడ్చేశాను. నాకు మార్కులు తక్కువ వచ్చినందుకే ఇలా జరిగిందని వాళ్ళు చెప్పారు. అదే నిజమైతే, నాకు ముందుగా అడ్మిషన్ కార్డ్ ఎలా వచ్చింది? ఆ ప్రశ్న నన్ను కొన్నేళ్ళ పాటు వెంటాడింది."