ఉమా పాటిల్ రెండు గదుల ఇంటిలో ఉన్న చిన్న ఇనుప బీరువాలో ఒక మూలన ఒక దశాబ్దకాలం పాటు చేతితో రాసిన రికార్డులు - పెద్ద రిజిస్టర్లు, నోట్ పుస్తకాలు, డైరీలు, సర్వే ఫారాల ఫొటోకాపీలు ఉన్నాయి. అవన్నీ మందంగా ఉన్న పోలిథిన్ సంచులలో ఒకదానిపై మరొకటి పెట్టివున్నాయి.
పెరుగుతూపోతోన్న ఈ దొంతరలలోనే మహారాష్ట్రలోని అనేక గ్రామీణ ప్రాంతాల ఆరోగ్యం - పిల్లల జననం, రోగనిరోధకత, కౌమార పోషణ, గర్భనిరోధం, క్షయవ్యాధి, ఇంకా మరెంతో సమాచారం - అధికృత సామాజిక ఆరోగ్య కార్యకర్తల (ఆశా - ASHA) ద్వారా నమోదు చేయబడివుంది. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా మిరాజ్ తాలూకాలోని అరాగ్ గ్రామ ప్రజల కోసం ఉమ, 2009 నుండి ఈ భారీ పుస్తకాలను నిర్వహిస్తున్నారు. ఇంకా, ఆరోగ్య సమస్యల గురించి పదేపదే గ్రామానికి తెలియజేయడానికి, మార్గనిర్దేశం చేయడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు.
45 ఏళ్ళ వయసున్న ఉమ లాగే గ్రామీణ మహారాష్ట్ర వ్యాప్తంగా 55,000 మంది ఆశాలు తమ గ్రామాలకు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అందేలా చూసేందుకు ప్రతిరోజూ గంటల తరబడి పనిచేస్తున్నారు. ఈ కార్మికశక్తి 2005లో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (ఎన్ఆర్ఎచ్ఎమ్)లో భాగంగా స్థాపించబడింది. అందరూ మహిళలే అయిన ఈ సామాజిక ఆరోగ్య కార్యకర్తలు 23 రోజుల శిక్షణ అనంతరం నియమితులయ్యారు. ఆదివాసీ గ్రామాలలో ప్రతి 1,000 మంది జనాభాకు ఒక ఆశాను (కనీసం 8వ తరగతి వరకు చదివినవారు), ఆదివాసీయేతర గ్రామాల్లో ప్రతి 1,500 మంది జనాభాకు ఒకరిని (కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులు) ఎన్ఆర్ఎచ్ఎమ్ తప్పనిసరి చేసింది.
దాదాపు 15,600 మంది జనాభా కలిగిన పెద్ద గ్రామమైన అరాగ్లో, ఉమతో పాటు మరో 15 మంది ఆశాలు ప్రతిరోజూ ఉదయం 10 గంటల సమయంలో వివిధ ప్రాంతాలకు బయలుదేరతారు. మిరాజ్ తాలూకాలోని బెడగ్, లింగనూర్, ఖాటవ్, శిందేవాడీ, లక్ష్మీవాడీ గ్రామాలకు అరాగ్ ప్రధాన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా. దాదాపు 47,000 మంది జనాభాకు 41 మంది ఆశాలు ఉన్నారు.
ప్రతి ఆశా, తనకు కేటాయించిన ప్రతి ఇంటికి వెళ్తుంది. సాధారణంగా నిర్దేశించిన రోజుకు ఐదు గంటల కంటే ఎక్కువ సమయాన్నే ఈ పనిలో గడుపుతుంది. “గ్రామంలోనే ఇళ్ళు ఉంటే, రెండు గంటల్లోనే 10-15 ఇళ్ళకు వెళ్ళవచ్చు. కానీ కొందరు గ్రామ సరిహద్దులలోనో లేదా పొలాల్లోనో ఉంటుంటారు. అప్పుడు నాలుగు ఇళ్ళకు వెళ్ళినా కూడా ఐదు గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇంకా మేం పొదలు, పొలాలు, బురద దారులగుండా కిలోమీటర్ల దూరం నడవాలి. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది," అని ఉమ చెప్పారు.















