"అయ్యో, అదే చివరి బర్గర్, దాన్ని ఇప్పుడే ఒకరు తీసుకెళ్ళిపోయారు, క్షమించండి మేడమ్," జంతర్ మంతర్ నిరసన ప్రదేశం బయట నాకు కనిపించిన రాహుల్ అన్నారు. ఆయనింకా తన బైక్ మీదే కూర్చొని ఉన్నారు. సాయంత్రం 6:30 అయ్యేసరికే ఆయన వెనుక కట్టి ఉన్న ఎరుపు రంగు జొమాటో డెలివరీ బ్యాగ్ దాదాపు ఖాళీ అయిపోయింది. "ఈ సంచిలో, 'ఎవరికి కావాలంటే వారు వచ్చి తీసుకోవచ్చు' అనే సందేశంతో 30 బర్గర్లు ఉండేవి. బెంగళూరు నుంచి ఎవరో వాటిని పంపించారు," అతను చెప్పారు.
బిహార్‌లోని దర్భంగా జిల్లాకు చెందిన రాహుల్ కుమార్ యాదవ్ పగటివేళల్లో ఒక విద్యార్థి. అతను ఈ నిరసనలో పాల్గొనడానికి తన చదువుకు విరామం తీసుకోలేదు; దానికి బదులుగా, సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు డెలివరీ బాయ్‌గా రాత్రి షిఫ్ట్‌లో పని చేయడాన్ని ఎంచుకున్నారు. అతను డెలివరీ చేసిన భోజనం ఆర్డర్లలో కొన్ని ఇతర నగరాలకు చెందినవారు డబ్బు చెల్లించినవే. పేరు తెలియని దాతలు పంపిన ఈ పార్శిళ్ళు ప్రత్యేకించి ఎవరిపేరునా పంపినవి కావు - జంతర్ మంతర్ వద్ద ఆకలితో ఉన్న ఎవరికోసమైనా సరే అన్నట్లుగా పంపినవి.
జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన లాఠీచార్జిలు, పెద్ద సంఖ్యలో ప్రజలను అదుపులోకి తీసుకోవటాల మధ్యనే వివిధ దిశల నుండి ఆహారం వచ్చి చేరుతూనే ఉంది. బర్గర్లు, శాండ్విచ్లు, పార్లే-జి బిస్కెట్ల వంటివాటిని వివిధ ఆన్లైన్ యాప్‌లకు చెందిన సర్వీస్ డెలివరీ భాగస్వాములు (అంటే గిగ్ శ్రామికులు) అక్కడకు చేరవేస్తున్నారు. అదేవిధంగా దిల్లీలోని కుటుంబాల నుండి వండిన ఆహారం కూడా వస్తూనే ఉంది. ముఖ్యంగా, దశాబ్దాలుగా ప్రజల కోసం తెరిచి ఉంచిన సమీపంలోని గురుద్వారా లంగర్ (స్వచ్ఛంద సేవకులు వండి, వడ్డించే ఉచిత సాముదాయక వంటశాల) నుండి కూడా.








