అప్పుడప్పుడూ వినిపించే పిట్టల కూజితాలు తప్ప అక్కడ వినిపించే ఏకైక నేపథ్య సంగీతం, నీరు నిండిన పొలాల్లో నీటిని తోసుకుంటూ స్త్రీలు వరి నాట్లు వేస్తున్న శబ్దం మాత్రమే. ఆపైన, ఉన్నట్టుండి ఐదుగురు స్త్రీలు బిహూ పాటను ఎత్తుకుంటారు.
అది జూలై నెల, అస్సామీ క్యాలెండర్లో అయితే ఆహార్ నెల. వరి నాట్లు వేసే మొదటి రోజైన దీనిని నోభుయి అని పిలుస్తారు. ఇది అక్షరాలా కొత్త వరి నారు నాటే రోజు. తితాబొర్లోని సొలొగురి గాఁవ్లో ఉండే హిరా శైకియా పొలంలో ఇప్పటికీ సూర్యుడు చర్మాన్ని చురుక్కుమనిపిస్తున్నాడు, గాలి తేమగా ఉంది, చేతినిండా వెన్నువిరిగేటంత పని. 52 ఏళ్ళ హిరా శైకియా నలుగురు స్నేహితులు ఈ పంటకాలంలోని మొదటి రోజున ఆమెకు సహాయం చేయడానికి వచ్చారు. 50 ఏళ్ళ గుణితా శైకియా ఆ గ్రామంలో పనిచేసే ఒక ఆశా. 55 ఏళ్ళ అరుణ బోరా బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం తయారుచేసే వంటమనిషి. 35 ఏళ్ళ బృష్టిపర్ణ సోనోవాల్, ఒకప్పుడు పంచాయతీ సభ్యురాలు. గృహిణి అయిన 35 ఏళ్ళ నోమీ శైకియా, ఒక రైతు కూడా. అందరు మహిళలూ తమ కుటుంబభారాన్ని మోయటానికి సహాయపడే కొద్దిపాటి సొంత భూమిలో వరిని పండిస్తారు. ఇలాంటి మళ్ళీ ఏదో ఒక రోజున, హిరా వారిలో ఎవరో ఒకరికి సహాయం చేస్తారు.






