అది ఆదివారం ఉదయం, కానీ జ్యోతిరింద్ర నారాయణ్ లాహిరి(50) తీరికలేకుండా ఉన్నారు. హూగ్లీ జిల్లాలో ఉన్న తన అపార్ట్మెంట్ లోపలి ఒక మూల గదిలో ఆయన 1778లో మేజర్ జేమ్స్ రెన్నెల్ సుందరవనాలపై రూపొందించిన మొదటి పటాన్ని(map) చూస్తున్నారు
"ఆంగ్లేయుల సర్వేపై ఆధారపడి సుందరవనాలపై రూపొందించిన మొదటి ప్రామాణికమైన పటం ఇది. కొల్కతా వరకు విస్తరించివున్న మడ అడవులను ఈ పటం చూపిస్తోంది. అప్పటినుంచి చాలా మారిపోయింది," తన వేళ్ళను పటంపై కదుపుతూ అన్నారు లాహిరి. భారతదేశం, బంగ్లాదేశ్లలో విస్తరించి, ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులైన ఈ సుందరవనాలు, వాటి అపారమైన జీవవైవిధ్యానికీ, ఇంకా రాయల్ బెంగాల్ పులులకూ (పాంథెరా టైగ్రిస్) ప్రసిద్ధి చెందినవి.
ఆయన గది గోడలకున్న పుస్తకాల అరలలో సుందరవనాలకు సంబంధించిన ప్రతి విషయం గురించి వందలాది శీర్షికలతో పుస్తకాలు నిండి ఉన్నాయి - వృక్షసంపద, జంతుజాలం, రోజువారీ జీవితం, పటాలు, అట్లాసులు, ఆంగ్ల, బంగ్లా భాషలలో పిల్లల పుస్తకాలు. 2009లో ఐలా తుఫాను ఈ ప్రాంతంలో విధ్వంసం సృష్టించిన తర్వాత ఆయన సుందరవనాల గురించి ప్రారంభించిన త్రైమాసిక ప్రచురణ 'శుధు సుందర్బన్ చర్చ' లోని విషయాలను ఆయన ఈ పుస్తకాల నుంచే పరిశోధించి, రూపొందిస్తారు.
"ఆ ప్రాంతంలోని పరిస్థితులను చూడటానికి నేను పదే పదే అక్కడికి వెళ్ళేవాడిని. అది చాలా భయానకంగా ఉండేది," అని ఆయన గుర్తుచేసుకున్నారు. "పిల్లలకు బడులు లేవు, జనానికి నివాసాలు లేవు, అనేకమంది మగవాళ్ళు వలసపోయారు, అన్నీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఆడవారిపై పడింది. నదుల కరకట్టలు నిలుస్తాయా కూలిపోతాయా అనేదానిపైనే ప్రజల గతి ఆధారపడివుంది."
విపత్తుపై మీడియా ఇచ్చే నివేదికలు పైపైవిగానూ, సారహీనంగానూ లాహిరికి అనిపించేవి. "మీడియా సుందరవనాల గురించి ఇదివరకటి మూస కథనాలనే మళ్ళీ మళ్ళీ చెప్తుంటుంది. సాధారణంగా మీరు పులి దాడుల గురించో, వర్షాల గురించో వార్తలనే చూస్తారు. వర్షాలు, వరదలు లేనప్పుడు సుందరవనాలు చాలా అరుదుగా వార్తల్లో కనిపిస్తుంటాయి," అన్నారతను. "విపత్తు, వన్యప్రాణులు, పర్యాటకం - ఇవే మీడియాకు ఆసక్తి కలిగించే విషయాలు."









