అతని పేరేమిటో ఎవరికీ తెలియదు. ఆ మొహల్లాలో అతనొక పిచ్చివాడైన ముసలాయనగా మాత్రమే అందరికీ తెలుసు. పగళ్ళు నవ్వుతూ, రాత్రులు ఏడుస్తూ, తనలో తానే సింధీలోనో ఉర్దూలోనో మాట్లాడుకునేవాడు కాబట్టే అతన్ని పిచ్చివాడనేవారు. అతను మాట్లాడేదంతా చాలా వరకు అర్థంపర్థం లేనిదే- అతను గాలిబ్ కవిత్వాన్ని వల్లిస్తుంటే తప్ప:
కోయీ వీరానీ సీ వీరానీ హై
దశ్త్ కో దేఖ్ కే ఘర్ యాద్ ఆయా
(ఈ ఎడారి ఎంతటి నిర్జన ప్రదేశం?
ఇలాంటి బీడు భూమిని చూసినప్పుడు నాకు ఇల్లు గుర్తుకొస్తుంది)
అతను చదువుతున్నది ఒక్క క్షణం పాటు విన్నప్పుడు, జ్ఞానానికీ పిచ్చికీ మధ్య ఉన్న గీత కుంచించుకుపోవడాన్ని మనం చూస్తాం.
దశాబ్దాలుగా అతని ఇల్లుగా ఉన్న ఆ ప్రదేశం ఇప్పుడు మొహల్లాకు ఒక చివరి మూలన ఉంది. అది ఒక పాడుబడిన, శిథిలావస్థలో ఉన్న ఇంటి ఎత్తైన వేదిక. అక్కడతను రెండు వీధి కుక్కలతో కలిసి కాపలా ఉండేవాడు.
అతనెప్పుడు వచ్చి ఈ ప్రదేశాన్ని తన నివాసంగా మార్చుకున్నాడో ఎవరికీ తెలియదు. అతని వయసెంతో కూడా ఎవరికీ తెలియదు. కానీ భారతదేశ పటంలా ముడతలుపడి కనిపించే అతని ముఖమంతా ముసలితనం పరుచుకొని ఉంది.
అతని గురించి కథలున్నాయి. విభజన సమయంలో అతను తన కుటుంబం నుండి విడిపోయాడని కొందరు, ఆ తర్వాత జరిగిన అల్లర్లలో అతని కుటుంబం చంపబడిందని మరికొందరు అన్నారు. మరికొందరు అతను ఒకప్పుడు వ్యాపారవేత్త అని, అతని భార్య, ఇద్దరు కుమారులు బహిష్కరించబడిన తర్వాత అతను తన సంపదనూ, విచక్షణనూ కోల్పోయాడని అన్నారు. అతని గడ్డం, తలకు చుట్టుకున్న మురికిపట్టిన ఆకుపచ్చని వస్త్రాన్ని బట్టి అతను ముస్లిమ్ అవునో కాదో ఎవరికీ తెలియదు. లేదా, మరికొందరు అనుకునేట్టు, ప్రతి సాయంత్రం అతను తన చిరిగిన పరుపు పక్కనే ఉన్న చిన్న గూటిలో దీపం వెలిగించి ప్రార్థనలా అనిపించే దేనినో గొణుగుతూ ఉండటం బట్టి అతను హిందువు కావచ్చును. ఏదేమైనా, ప్రజలు అతనిపై జాలిపడి మిగిలిపోయిన ఆహారాన్ని అతనికి ఇచ్చారు. రేషన్ సామాగ్రి దొరకడం కష్టంగా ఉన్నప్పుడు కూడా, ప్రజలు తమ వద్ద ఉన్న దానిలో కొంత అతనికి ఇచ్చేవారు.
కానీ గత కొన్ని రోజులుగా అతను ఒక్క పిడచ కూడా తినలేదు. మునుపటిలా వీధుల్లో తిరగడం మానేశాడు. అక్కడేదో గొలుసులతో బంధించబడినట్లు కనిపించాడు. అతను దీపం వెలిగించలేదు, గాలిబ్ను కూడా గుర్తుచేసుకోలేదు. అతను ఎవరినీ తన దగ్గరికి రానివ్వలేదు, ఆ మూలలో మరింత మరింతగా ముడుచుకుపోయాడు. అతను చనిపోయే వరకూ. తానొక ముళ్ళ కంచెను మింగానని, అది తన గొంతులో ఇరుక్కుపోయిందని అతను ఫిర్యాదు చేయడం విన్నామని కొందరు చెప్పారు. మరొకరు అది తప్పనిసరిగా కోవిడ్ అయి ఉంటుందని అన్నారు.


