పాకిస్తాన్ సరిహద్దు నుండి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో, షంషేర్ సింగ్ తన సోదరుడి గ్యారేజీలో తన పనిముట్లను వెతుకుతూ పనిలో ఉన్నారు. గత మూడు సంవత్సరాలుగా ఆయన ఇక్కడ మెకానిక్‌గా పనిచేస్తున్నారు, కానీ ఆ పని ఆయన ఎంచుకున్నదైతే కాదు.
మూడవ తరం బరువులు మోసే కూలీ (పోర్టర్) అయిన 35 ఏళ్ళ షంషేర్, భారత పాకిస్తాన్ల మధ్య ఉన్న అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద కొంతకాలం క్రితం బరువులు మోసే కూలీగా పనిచేశారు. ఆయన కుటుంబం రాష్ట్రంలో ఇతర వెనుకబడిన కులాల (ఒబిసి) కింద జాబితా చేసివున్న ప్రజాపతి సముదాయానికి చెందినది.
పంజాబ్ వైపు నుంచి పాకిస్తాన్‌తో ఉన్న ఈ సరిహద్దు వద్ద సిమెంట్, జిప్సమ్, ఎండు ఫలాలతో నిండివున్న వందలాది ట్రక్కులు ప్రతిరోజూ భారతదేశంలోకి వచ్చేవి. అదే విధంగా టొమాటోలు, అల్లం, వెల్లుల్లి, సోయాచిక్కుళ్ళ ద్రావకం, నూలుతో పాటు ఇతర వస్తువులతో కూడిన ట్రక్కులు కూడా భారతదేశం నుంచి పాకిస్తాన్లోకి చేరుకునేవి.
అక్కడ పనిచేసే దాదాపు 1,500 మంది పోర్టర్లలో షంషేర్ కూడా ఒకరు. అతని పని "సరిహద్దు దాటుతున్న వారి తర్వాతి ప్రయాణం కోసం రెండు వేపుల నుంచి వచ్చే ఈ వస్తువులను ట్రక్కుల్లోంచి దింపడం, మళ్ళీ ఎక్కించడం." ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీలు గానీ, పరిశ్రమలు గానీ లేవు; అట్టారీ-వాఘా సరిహద్దుకు 20 కి.మీ పరిధిలో ఉన్న ఈ గ్రామాలకు చెందిన భూమిలేని జనం తమ జీవనోపాధి కోసం సరిహద్దుల మధ్య జరిగే వాణిజ్యంపై ఎక్కువగా ఆధారపడుతున్నారు.









