"నేను ఒవీ అనువాదాలపైనే కృషిని కొనసాగించాలనుకుంటున్నాను."
ఈ మాటలు చెప్పే సమయానికి ఆశాతాయి తొంభై ఏళ్ళకు దగ్గరపడుతున్నారు. కింద పడిపోవటంతో అయిన గాయం నుండి కోలుకుంటోన్న ఆమెకు ల్యాప్‌టాప్ ఉపయోగించడం కష్టంగా ఉంది. దాంతో, మేం చేతి రాత అనువాదాలకు మారాం. 80 నుండి 100 ద్విపదలు ముద్రించిన కాగితంపై ఆమె తన అనువాదాలను రాసేవారు. ఆ బ్యాచ్ పూర్తయిన తర్వాత, ఆమె తర్వాతి దానిపై పనిచేసేవారు.
ఈ అనువాదాలపై ఆమెతో కలిసి పనిచేసిన జీతేంద్ర మైడ్, వాటిని డేటాబేస్‌లోకి అప్డేట్ చేశారు.
"ఒక గ్రంథాలయాధికారి అంటే పుస్తకాలను జాగ్రత్తగా చూసుకునే ఒక గంభీరమైన వ్యక్తి అనేది కళాశాల రోజుల వరకు నాకున్న అవగాహన. కానీ 1996లో నేను హేమాతాయి రాయిర్కర్ ఇంట్లో అశాతాయి ఓగ్లేను కలిసినప్పుడు, ఈ [సంకుచితమైన] అవగాహన మాయమైపోయింది," అని జీతేంద్ర మైడ్ చెప్పారు. 1996 నుండి ఆమె చివరి రోజుల వరకు దాదాపు మూడు దశాబ్దాల పాటు విసుర్రాయి పాటలను అనువదించడంలో ఆయన ఆశా తాయితో కలిసి పనిచేశారు.






