పేరు: వజేసింగ్ పార్గీ. జననం: 1963. గ్రామం: ఇతవా. జిల్లా: దాహోద్, గుజరాత్. సముదాయం: ఆదివాసీ పంచమహాలీ భీల్. కుటుంబ సభ్యులు: తండ్రి, చిస్కా భాయి. తల్లి, చతుర బెన్. ఐదుగురు తోబుట్టువులు. వీరిలో వజేసింగ్ పెద్దవారు. కుటుంబ జీవనాధారం: వ్యవసాయ కూలీ.
నిరుపేద ఆదివాసీ కుటుంబంలో పుట్టిన తన వారసత్వం గురించి వజేసింగ్ మాటల్లోనే: 'అమ్మ కడుపులోని అంధకారం.' 'ఎడారి వంటి ఒంటరితనం.' 'బావి నిండేంత చెమట.' దుఃఖంతో నిండిన 'ఆకలి,' 'మిణుగురుల కాంతి.' పుట్టుకతోనే వచ్చిన పదాల పట్ల ప్రేమ కూడా ఉంది.
ఒకసారి, అనుకోకుండా ఒక పోరాటం మధ్యలోకి వెళ్ళటంతో అప్పటికి యువకుడిగా ఉన్న ఈ ఆదివాసీ కవి దవడనూ మెడనూ చీల్చుకుంటూ ఒక బుల్లెట్ దూసుకుపోయింది. ఏడు సంవత్సరాల చికిత్స, 14 శస్త్రచికిత్సలు, తీర్చలేని అప్పుల తర్వాత కూడా ఆయన ఇప్పటికీ కోలుకోలేకపోయారు. ఆ గాయం వలన ఆయన గొంతు కూడా దెబ్బతిన్నది. అది ఆయనకు రెట్టింపు దెబ్బ. ఒక స్వరమేలేని సమాజంలో పుట్టిన ఆయనకు, వ్యక్తిగా ఒక బహుమతిగా పొందిన స్వరం కూడా ఇప్పుడు తీవ్రంగా దెబ్బతిన్నది. ఆయన కళ్ళు మాత్రమే ఎప్పటిలాగే తీక్షణంగా ఉన్నాయి. ఎంతోకాలానికి గుజరాతీ సాహిత్యం చూసిన అత్యుత్తమ ప్రూఫ్ రీడర్ వజేసింగ్. అయితే, ఆయన స్వంత రచనలు మాత్రం అంతగా వాటికి రావలసిన ప్రాచుర్యాన్ని పొందలేకపోయాయి.
తన సందిగ్ధావస్థను ప్రతిబింబిస్తూ వజేసింగ్, మూల భాష అయిన పంచమహాలీ భీలీని గుజరాతీ లిపిలో రాసిన కవితకు ఇది తెలుగు అనువాదం.


