ఫ్రంట్‌లైన్ పత్రిక ఆరంభించిన 1984 ప్రాంతంలో రైతుల ఇళ్ళకు వెళ్ళినపుడు తాజా పాల గ్లాసుతో వాళ్ళంతా స్వాగతం చెప్పేవాళ్ళు. పశ్చిమ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో తిరిగి వెళ్ళేటప్పుడు కూడా మరో గ్లాసెడు పాలు ఇచ్చేవాళ్ళు. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో తరచుగా వెండి గ్లాసులో పాలు ఇచ్చేవాళ్ళు. అది ఒక పక్కన వాళ్ళు అతిథికి ఇచ్చే మర్యాదను సూచించేది; మరో పక్కన ఆయా రైతుల మెరుగైన ఆర్థిక స్థితిగతులను సూచించేది.
తమిళనాడు రైతుల ఇళ్ళల్లో అయితే స్వచ్ఛమయిన ఇత్తడి గ్లాసుల్లో పాలు ఇచ్చేవారు. వాటిల్లో ఒకోసారి ప్రశస్తమైన ఫిల్టర్ కాఫీ కూడా లభించేది. 1990లు వచ్చేసరికి చాలా రాష్ట్రాలలో వెండి గ్లాసుల స్థానంలోకి స్టీలుగ్లాసులు వచ్చిచేరాయి. 1991 వచ్చేసరికి అవే పాలు అంచులు విరిగిన పింగాణీ కప్పుల్లో అందేవి. 90వ దశకం నడుమ రోజులకు గాజుగ్లాసుల్లో పాలు తాగటం మొదలయింది.
2000వ సంవత్సరం, పాల స్థానంలో చాయ్ వచ్చి చేరింది. 2003-04 వచ్చేసరికి మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో అది కాస్తా పాలులేని చాయ్‌గా మారింది. టీలో పంచదార మోతాదు అన్నది గ్రామీణ ప్రాంతాల్లో అతిథులకిచ్చే గౌరవమర్యాదలకు సూచిక. ఆ పంచదార మోతాదు కూడా క్రమక్రమంగా తగ్గసాగింది. అలాగే ఆ దశకం సగం గడిచేసరికి గాజు గ్లాసులూ అదృశ్యమయ్యాయి. ఇప్పుడు పాలు కలపని ఆ కొద్దిపాటి నల్లటి చాయ్ బస్సుల్లోనూ రై ళ్ళల్లోనూ కనిపించే వికారమైన ప్లాస్టిక్ కప్పుల్లో ప్రత్యక్షమయ్యాయి.
2018లో స్వతంత్ర సమరయోధులు గణపతి బాల్ యాదవ్‌ను సాంగ్లీ లోని వారి స్వగృహంలో కలిశాను. గంటల తరబడి సాగిన ఇంటర్వ్యూ తర్వాత ఆయన నాకు తాజా పాలు ఇచ్చి వీడ్కోలు పలికారు; ఈసారి ఆ పాలను అల్యూమినియం గ్లాసులో అందించారు.

















