కోవిడ్ -19 మహామారి కారణంగా వికాస్ కుమార్ భారత సైన్యంలో చేరేందుకు తీసుకుంటోన్న దేహదారుఢ్య (ఫిజికల్ ఫిట్నెస్) శిక్షణను నిలిపేయవలసి వచ్చింది. 2022 ప్రారంభంలో అతను ఆరాలోని విమానాశ్రయ మైదానంలో ఉన్న 400 మీటర్ల ట్రాక్‌పై, 1.6 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి 4-5 చుట్లు పరుగెత్తడాన్ని తిరిగి ప్రారంభించాడు. "నేను ఆ దూరాన్ని 5 నిమిషాల 20 సెకన్ల నుండి 5 నిమిషాల 25 సెకన్లలో పూర్తి చేస్తాను," అని అతను చెప్పాడు.
అతను సర్వదా తన సమయాన్ని గమనించుకుంటూ, రోజుకు 5-6 సార్లు పరుగులు తీస్తాడు. అదే కాకుండా, ఒకేసారి త్వరత్వరగా 8-10 పుల్-అప్లు తీయటం; అనేక స్క్వాట్లు, పుష్-అప్లు, ఇంకా ఇతర వ్యాయామాలను వరుసగా చేస్తాడు. "నేను దేహ దారుఢ్య పరీక్షలలో [సైన్యంలో చేరటం కోసం] పాల్గొని ఉంటే నా శరీరంపై 'ఉత్తమం' అనే ముద్ర పడేది," అని అతను చెప్పాడు. ఒక అభ్యర్థి అవసరమైన దూరాన్ని చాలా ముందుగానే పూర్తి చేస్తే, ఆర్మీ అధికారులు అతని ఛాతీపై ఆ పదాన్ని ముద్రిస్తారు.
వికాస్ దేహదారుఢ్య పరీక్ష కోసం సిద్ధంగా ఉన్నాడు.
కానీ జూన్ 2022, కోవిడ్-19 కంటే ప్రాణాంతకం అని నిరూపించిన అభివృద్ధి ద్వారా అతన్నీ, ఇంకా చాలామంది యువకులనూ ఓడించింది. ఇది మహామారి స్థాయి వ్యాధి కాదు, కానీ విధాన ఆధారిత వ్యాధి.
దానిని అగ్నిపథ్ పథకం అని పిలుస్తారు. ఈ పరీక్షలో అతను అత్యద్భుతంగా రాణించినప్పటికీ, అతని ఛాతీపై ముద్రించేది ‘ఉత్తమం’ అని కాదు - అతని యూనిఫామ్ మీదా, సామాను మీదా కేవలం 'అగ్నివీర్' అనే ముద్ర మాత్రమే పడుతుంది.
















