తన సెల్ ఫోన్ మోగడం మొదలవ్వగానే, 20 ఏళ్ళ కిరీట్ త్వరత్వరగా ఒక డెస్క్‌టాప్ ముందు కూర్చుని, హెడ్ఫోన్లు పెట్టుకుని, ఒక పెన్ను తీసుకుని, తన డైరీని తెరిచాడు.
"నమస్కార్, శివార్ హెల్ప్‌లైన్," అతను నెమ్మదిగా, స్థిరమైన స్వరంతో అన్నాడు.
అవతలివైపు ఉన్నది మహారాష్ట్ర, నాందేడ్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన పార్వతి అనే నడివయసు మహిళా రైతు.
"నేను మీకెలా సహాయం చేయగలను?" అని కిరీట్ మరాఠీలో అడిగాడు. పుణేలోని ఒక కళాశాలలో బిఎ సైకాలజీ మూడవ సంవత్సరం చదువుతోన్న అతని స్వస్థలం పర్భణీ జిల్లాలోని ఒక గ్రామం.
పార్వతి సందేహించారు. ఆమె గొంతు వణుకుతోంది.
“వానలు మా పంటలన్నింటినీ నాశనం చేశాయి,” ఆమె ఎలాగో చెప్పగలిగారు. “సోయాచిక్కుళ్ళు, తూర్ (కందులు)... మేకలు కూడా పోయాయి. ఇప్పుడు పని కూడా లేదు.” ఆ కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యవసాయం, పశువులు, కాలానుగుణంగా దొరికే కూలి పనులు అన్నీ నీటిలో మునిగిపోయాయి. తీసుకున్న అప్పులు తీర్చలేదు; ఆశలు కూడా నీట మునిగాయి. రాబోయే రబీ సీజన్ కోసం ఆయనేమైనా పెసర విత్తనాలు అందించగలరేమోనని ఆమె అడుగుతున్నారు.
"మాకు విత్తనాలు దొరికితే, కనీసం వేసవికాలం వరకైనా నెట్టుకురాగలం," ఆమె తర్కించారు.

























