ఏడాది మొత్తంలో ఎక్కువకాలం ఉష్ణోగ్రతలు ఉగ్రరూపం చూపించే రణ్ భూమిలో, వర్ష ఋతువులో వచ్చే వానలు నిజంగా ఒక వేడుకే. దహించివేసే వేడిమి నుంచి సాంత్వననిచ్చే ఈ ఋతువు కోసం ప్రజలు ఆతురతతో ఎదురుచూస్తుంటారు. మహిళ దైనందిన జీవితంలో ప్రేమ కలిగించే తెరపికి ఇక్కడ వర్షం ఒక రూపకం (మెటఫర్) కావటంలో ఆశ్చర్య మేమీ లేదు
అయితే, వర్షఋతువులో కురిసే వానల ప్రణయ వైభవాలు కచ్చీ జానపద సంగీతంలో అనుపమానమైనవేమీ కావు. నాట్యమాడే నెమళ్ళు, నల్లని మబ్బులు, వర్షం, తన ప్రియుని కోసం పరితాపం చెందే యువతివంటి ప్రతీకలు భారతదేశంలోని శాస్త్రీయ, ప్రసిద్ధ, జానపద సంగీతాల సంప్రదాయాల వర్ణపటలంలోనే కాక, వివిధ శైలులకు చెందిన వర్ణచిత్రాలలోనూ సాహిత్యంలోనూ మనకు అదేపనిగా పదేపదే కనిపిస్తాయి
అయినప్పటికీ, ఇవన్నీ గుదిగుచ్చిన ఈ పాటను అంజార్కు చెందిన ఘెల్జీభాయ్ గుజరాతీలో పాడటాన్ని ఇక్కడ విన్నప్పుడు ఇవే ప్రతీకలు ఈ ఋతువులోని తొలకరుల తాజా శోభను మనకోసం తీసుకురావటంలో విజయం సాధించాయని తెలుస్తుంది.



