" వానలు పడిన తర్వాత ముస్కెనీ పచ్చని లేత ఆకులు తియ్యగా రుచిగా ఉంటాయి. వేసవి ఎండకు ఆ ఆకులు కమిలిపోయి, గట్టిగా మారుతాయి," అన్నారు కౌశల్య. ఆమె తన రెండు గదుల పక్కా ఇంటి ముందున్న వరండాలోని వంటగదిలో ఉన్నారు. ఆమె మాట్లాడుతూనే ప్రెజర్ కుక్కర్లో కడిగిన కందిపప్పు(అర్హర్ దాల్)తో పాటు ముస్కెనీ, రెండు పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు వేశారు.
"ముస్కెనీ భాజీ [ఆకుకూర], అర్హర్ (కందిపప్పు), చనా దాల్ [శనగపప్పు]లతో కలిపి వండితే చాలా బాగుంటుంది," అంటూ కౌశల్య కొనసాగించారు. ఛత్తీస్గఢ్లో విస్తృతంగా పెరిగే ముస్కెనీ ఆకులను ఎక్కువగా పప్పులతో కలిపి వండుతారు. ఆ ఆకుకూరతో వివిధ రకాల వంటకాలను చేసే విధానాలను ఆమె చాలా సంతోషంగా మాతో పంచుకున్నారు. కుక్కర్ మూడు నాలుగు విజిల్స్ వచ్చేందుకు ఎదురుచూస్తూ ఆమె, పప్పులో కలపడానికి పనికీ (కత్తిపీట)తో కొన్ని వెల్లుల్లి రెబ్బలను, టమోటాలను, ఉల్లిపాయలను కోసి, తాలింపు వేయటానికి ఎండు మిరపకాయలను సిద్ధం చేశారు..













