చాలా కుటుంబాలు మొదట పశువును కొని, ఆ తర్వాత దాని మేత గురించి ఆందోళనపడతాయి. కానీ జశ్విందర్ కౌర్, ఆమె భర్త జగ్సీర్ సింగ్ దీన్ని మరోలా చేస్తారు.
వారికి ఇంకా కొనే స్తోమత లేకపోయినా, వాళ్ళు గేదె మేతకోసం దాణాను నిల్వ చేయటానికి ఒక కుప్ను కడుతున్నారు. తూడీ [ఎండు మేతగా ఉపయోగించే కోసిన గోధుమ గడ్డి] ధర దాదాపు 75 శాతం తగ్గడం వారిని ఈ దారిలోకి నడిపించింది. 2024లో క్వింటాల్ తూడీ రూ. 800-1,000కు అమ్ముడైంది; ఈ సీజన్లో ఆ ధర క్వింటాల్‌కు రూ. 200–250కు పడిపోయింది.
దాంతో సంగ్రూర్ జిల్లాలోని చంగాలీవాలా గ్రామానికి చెందిన ఆ జంట పశువును ఇంటికి తీసుకురావడానికి ముందే దాణాను కొనుగోలు చేసి, నిల్వ చేయడం మంచిదని అనుకున్నారు.
ఆ కుటుంబానికి అదనపు పోషకాహారం కావాలి - వారి 27 ఏళ్ళ కుమారుడు వర్ధమాన కబడ్డీ ఛాంపియన్ కావటంతో ఆ కుటుంబపు గేదె నుండి లభించే ఒక గ్లాసు పాలు అతనికి సహాయపడతాయి. "మెరుగైన ఆహారం, ముఖ్యంగా గ్రామంలో కబడ్డీ ఆడే మా కొడుకుకు, చాలా అవసరం," 50 ఏళ్ళ జశ్విందర్ చెప్పారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో ఒకరు వివాహం చేసుకుని దూరంగా నివసిస్తున్నారు. మరొక అమ్మాయి 25 ఏళ్ళ గగన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, కొన్ని సంవత్సరాల క్రితం తన తల్లి అనారోగ్యానికి గురవటంతో ఇంటిని చూసుకుంటోంది.
ఒక కుప్ను నిర్మించాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ కుటుంబం, జగ్సీర్ తల్లి తరఫు బంధువైన గుర్మెయిల్ సింగ్‌ను సంప్రదించింది. 60 ఏళ్ళ వయసుండే ఈ అనుభవజ్ఞుడు, నిపుణుడైన పనివాడు గత 40 సంవత్సరాలలో తాను 2,000 కుప్లను నిర్మించినట్టు అంచనా వేస్తున్నారు. “గోధుమ పంట కోతల తర్వాతి నెలల్లో మేం ప్రతిరోజూ కనీసం రెండు కుప్లనైనా కట్టేవాళ్ళం," అంటారాయన.
కుప్ అనేది పశుగ్రాసాన్ని నిల్వ చేయడానికి తక్కువ ఖర్చుతో కట్టే గోపురం ఆకారంలో ఉండే ఒక తాత్కాలిక నిర్మాణం. ఒకప్పుడు పంజాబ్ గ్రామీణ ప్రాంత ప్రకృతి చిత్రంలో అంతర్భాగంగా ఉన్న ఈ కుప్ ఇప్పుడు ఎక్కడో తప్ప కనిపించటంలేదు. దిల్లీ నుండి పంజాబ్‌లోని చంగాలీవాలాకు వెళ్ళే రైలులో కూర్చున్న నాకు ఆ ప్రయణంలో ఇవి చాలా తక్కువ సంఖ్యలో కనిపించాయి.



















