ఇది ఒక దైవిక సమావేశం—కేవలం ఒక అంశంలో కాకుండా ఎన్నో విధాలుగా అని చెప్పవచ్చు.
జిల్లా ప్రధాన కార్యాలయమైన నారాయణ్‌పూర్‌లో జరిగే మావ్లి మేళాలో, బస్తర్ ప్రాంతంలోని అనేక ఆదివాసీ దేవతలు ఏడాదికి ఒకసారి సమావేశమవుతారు. ఈ వార్షిక మడాయ్ (దేవతల కూటమి)ని పంటకోతల తరువాత జరుపుకుంటారు. ఈ పండుగ దాదాపు 700 సంవత్సరాల నుండి కొనసాగుతోందని చెబుతారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌తో పాటు, చుట్టుపక్కల ప్రాంతాలలోని ఆదివాసీ కుటుంబాలు, సముదాయాలు కలిసి తాము పూజించే దేవతలను మారుమూల ప్రాంతమైన అబూజ్మాడ్ (అబూజ్మార్, అభుజ్‌మాడ్ అని కూడా పిలుస్తారు) నుండి సుదూరంలో ఉన్న కాంకేర్ వరకు ఊరేగింపుగా తీసుకువస్తాయి. సంగీతం, నృత్యాలతో సాగే వాళ్ళ ప్రయాణం సంతోషకరంగా, సందడిగా నడుస్తుంది.
ప్రజలు తమ కులదైవాన్ని ఈ మడాయ్కి తీసుకువస్తారు. ఇక్కడి ఆదివాసులు తమ పూర్వీకులను తమ దైవంగా కూడా భావిస్తారు. ఇలా, మావ్లి మేళాలో ఒకరి కులదైవం ఇతరుల కులదైవాలను కలవడం జరుగుతుంది. ఈ ఆదివాసీ దేవతలు మనుషుల్లానే ప్రవర్తిస్తారు; ఇక్కడ వారికి ఒకరినొకరు కలుసుకొని, కౌగిలించుకొని, సంతోషంగా వేడుకలు చేసుకునే బంధువులు కూడా ఉంటారు..
“ఇది వారం రోజుల పాటు జరిగే మేళా,” నారాయణ్‌పూర్ నివాసి, ఆదివాసీయేతరుడైన విశ్వనాథ్ దేవాంగన్ అనే వృద్ధుడు తెలిపారు. ఈ వేడుకలను వీక్షించడానికి చాలామంది ఆదివాసీయేతరులు కూడా ఇక్కడికి వస్తారు.
మావ్లి మాత (మాతృదేవత) మేళాతో ఈ పండుగ మొదలవుతుంది. తరువాత, చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఇతర దేవతలు వస్తారు. ఇది కూడా చదవండి: గంగ్రెల్లో నిర్వాసిత దేవత నృత్యం
ఫిబ్రవరిలో, ఒక వెచ్చని ఉదయాన నేను ఇక్కడికి చేరుకున్నాను. నారాయణ్పూర్లోని సంత సమీపంలో ఉన్న పెద్ద పెద్ద సాముదాయక మైదానాలు వేగంగా జనాలతో నిండిపోతున్నాయి. బస్సులు, టాక్సీలలో వేలాదిమంది ప్రజలు తరలి వస్తున్నారు. ఈరోజు ఇక్కడికి రావడం కోసం, చాలామంది నడుచుకుంటూ తమ గ్రామాల నుండి నిన్ననే బయలుదేరారు. వాళ్ళలో అనేకమందికి చెప్పులు కూడా లేవు.
























