“నిజానికి నేను అదృష్టవంతుడిని,” రోషన్ సదాశివ్ కుళే PARIతో అంటున్నారు. ఆ పరిస్థితి నుండి బతికి బయటపడి, ఇంటికి తిరిగి రావడం అదృష్టమే మరి.
ఇదంతా ఐదేళ్ళ క్రితం మొదలైంది. మింథూర్ గ్రామానికి చెందిన ఈ 34 ఏళ్ళ చిన్నకారు రైతు రోషన్‌కు 12 జెర్సీ ఆవులు ఉన్నాయి. అవి చర్మంపై గడ్డలు వచ్చే వ్యాధి (Lumpy skin disease) బారిన పడటంతోనే ఈ కష్టాలన్నీ మొదలయ్యాయి. మార్చి 2021, కోవిడ్-19 రెండో దశ దేశమంతటా ఉధృతంగా వ్యాపిస్తున్న సమయంలో, మహారాష్ట్ర అంతటా ఈ వ్యాధి పశువులను కబళిస్తోంది.
“వాటి చికిత్స కోసం చాలా డబ్బు ఖర్చు చేశాను. అయినా వాటి ఆరోగ్యం మాత్రం మెరుగుపడలేదు,” రోషన్ గుర్తుచేసుకున్నారు.
ఆరు ఆవులు చనిపోయాయి. పాల ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. పాడి ద్వారా వచ్చే రోజువారీ ఆదాయం ఆగిపోయింది. కానీ ఖర్చులు మాత్రం తగ్గలేదు. చంద్రపూర్ జిల్లాలోని అడవులు ఎక్కువగా ఉన్న నాగ్‌భిడ్ తెహసిల్కు చెందిన ఆ చిన్నకారు రైతు వద్ద మిగిలిన ఆరు ఆవులకు మందులు, టీకాలు కొనడానికి చేతిలో డబ్బులు లేవు.
మహావ్యాధి కారణంగా నగదు దొరకటం కష్టంగా మారటంతో బ్యాంకు నుండి అప్పు దొరకడం కష్టంగా ఉండేది. బ్యాంకింగ్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్న ఓ స్నేహితుడి ప్రోద్బలంతో రోషన్ దగ్గర్లో ఉన్న బ్రహ్మపురి పట్టణంలోని ఓ ప్రైవేట్ వడ్డీవ్యాపారిని సంప్రదించి, అనధికారికంగా ఒక లక్ష రూపాయల అప్పు తీసుకున్నారు.
అప్పటికి ప్రమాదం తప్పిందని ఆయన అనుకున్నారు.
“అసలప్పుడే ఇదంతా మొదలైంది,” ఆయన గుర్తుచేసుకున్నారు.
2021 మార్చ్‌లో ఆవుల ప్రాణాలు కాపాడే మందులు కొనడానికి రోషన్ తీసుకున్న లక్ష రూపాయల అప్పు, ప్రైవేట్ వడ్డీవ్యాపారుల లెక్కల్లో రూ. 50 లక్షలకు పెరిగిపోయింది. ఆ అప్పుల భారం చివరకు ఈ రైతును అక్రమ అవయవ మార్పిడి ముఠాలోకి లాగి, దాని మూలంగా ఆయన తన మూత్రపిండాన్ని కోల్పోయారు. ఆయన ఒక అంతర్జాతీయ సైబర్ నేర ముఠా వలలో చిక్కుకొని, లావోస్‌లో బందీగా ఉండాల్సి వచ్చింది.















