ఆ ఆరూ నీ అరచేతిలో ఇమిడిపోగలవు. కొంచం కారం, కొంచం ఉప్పుతో కలిపి నూరితే అవి ఒక రుచికరమైన వంటకంగా మారిపోతాయి. అందుకని రామ్‌ప్రసాద్, అతని తోటి స్నేహితులు ఒక ప్లాస్టిక్ డబ్బాలో బురద పీతల (సిల్లా సెర్రాటా)ను పట్టి, విందు కోసం సిద్ధపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్, శ్రీ సత్యసాయి జిల్లాలో బంజారాలు నివాసముండే మలకవారిపల్లి తాండాలో, మండుతోన్న ఎండ నుండి ఉపశమనం కలిగిస్తోన్న దట్టమైన చెట్ల నీడల పందిరి కింద ఈ పిల్లలంతా కుదురుకున్నారు. వారి వంటకంలోని ప్రధాన దినుసు - బురద పీతను 'పచ్చ పీత', 'మడ పీత' అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశ తూర్పు తీరంలో కనిపిస్తుంది.
అమడగూరు మండలంలోని ఈ ప్రశాంతమైన ప్రదేశం ఒక లోయలో ఉంది - వరి పొలాలు, టమోటా, మిరప మొక్కలను మిట్టలు చుట్టుముట్టి ఉన్నాయి. పచ్చగా కనిపిస్తోన్న దృశ్యానికి పూర్తి విరుద్ధంగా, బోరు బావులు 800 నుండి 1,200 అడుగుల లోతుకు వెళ్తే గానీ నీరు పడదని మాకు చెప్పారు. అయినా కూడా, పంటలకు నీటిపారుదల రోజుకు ఎనిమిది గంటలకు మాత్రమే పరిమితం.






