లాద్ హైకో చూడటానికి చాలా సులభమైన వంటకం లాగే అనిపిస్తుంది, ఎందుకంటే ఇది చేయడానికి కావలసింది కేవలం రెండే పదార్థాలు - బులుం (ఉప్పు), ససంగ్ (పసుపు). అయితే దీన్ని చేయటంలోనే అసలైన సవాల్ ఉందని దాన్ని వండేవారు అంటున్నారు.

ఆ వంటమనిషే ఝార్ఖండ్‌కు చెందిన ఒక హో ఆదివాసీ, బిర్సా హెంబ్రోమ్. సంప్రదాయ చేపల వంటకమైన లాద్ హైకో లేకుండా ఈ వర్షాకాలం సంపూర్ణం కాదని ఆయన అంటారు. ఈ కూరను వండటాన్ని ఆయన తన ముదై (తల్లిదండ్రులు) నుంచి నేర్చుకున్నారు.

జాలరి కూడా అయిన ఈ 71 ఏళ్ళ రైతు ఖుంట్‌పానీ బ్లాక్‌లోని జంకోససన్ గ్రామంలో నివసిస్తుంటారు. ఈయన హో భాష మాత్రమే మాట్లాడతారు. ఇది ఈ సముదాయపు ప్రజలు మాట్లాడే ఆస్ట్రోఏషియాటిక్ ఆదివాసీ భాష. 2013లో జరిగిన చివరి జనాభా లెక్కల ప్రకారం ఝార్ఖండ్‌లో ఈ సముదాయానికి చెందినవారు కేవలం తొమ్మిది లక్షలమంది మాత్రమే ఉన్నారు; ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో కూడా కొద్దిమంది హో ప్రజలు నివసిస్తున్నారు ( భారతదేశంలో షెడ్యూల్డ్ తెగల గణాంకాలు , 2013).

వర్షాకాలంలో బిర్సా, సమీపంలోని నీరు నిండిన పొలాల నుండి మొదటగా తాజా హాద్ హైకో (పిత్త పరిగెలు), ఇచె హైకో (రొయ్యలు), బుంబుయ్ , డాండికే , దూడీ వంటి రకరకాల చేపలను పట్టుకొని, వాటిని జాగ్రత్తగా శుభ్రం చేస్తారు. అప్పుడతను వాటిని తాజాగా కోసిన కకరూ పత్తా (గుమ్మడి ఆకులు) మీద ఉంచుతారు. సరిగ్గా సరిపోయేలా ఉప్పు, పసుపును వేయటం ఇందులో కీలకం, “ఎక్కువగా వేస్తే అది ఉప్పగా ఉంటుంది, చాలా తక్కువగా వేస్తే అది చప్పగా ఉంటుంది. మంచి రుచి రావాలంటే ఇది సరిగ్గా సరిపోవాలి!" హెంబ్రోమ్ చెప్పారు

చేపలు మాడిపోకుండా ఉండడానికి, అతను పలుచని గుమ్మడి ఆకులపై మందపాటి సాల్ (ఏగిస) ఆకులను అదనపు పొరగా చుట్టారు. ఇది గుమ్మడి ఆకులను, పచ్చి చేపలను మాడిపోకుండా చూస్తుందని అతనన్నారు. చేప ఉడికి తయారయ్యాక, అతను వాటిని గుమ్మడి ఆకులతో సహా తినడానికి ఇష్టపడతారు. "మామూలుగా చేపలను చుట్టే ఆకులను పారేస్తాను, కానీ ఇవి గుమ్మడి ఆకులు కాబట్టి వీటిని తింటాను. మీరు సరిగ్గా చేస్తే, ఆకులు కూడా మంచి రుచిగా ఉంటాయి," అని ఆయన వివరించారు.

చూడండి: బిర్సా హెంబ్రోమ్, లాద్ హైకో

ఈ వీడియో కోసం హో భాష నుండి హిందీ భాషకు అనువదించినందుకు అర్మాన్ జముదాకు PARI ధన్యవాదాలు తెలియజేస్తోంది.

అంతరించిపోతున్న భాషలపై PARI ప్రాజెక్ట్, భారతదేశంలో అంతరించిపోతోన్న భాషలను వాటిని మాట్లాడే సాధారణ ప్రజల స్వరాల ద్వారా, ప్రత్యక్ష అనుభవాల ద్వారా డాక్యుమెంట్ చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

హో భాష మధ్య, తూర్పు భారతదేశంలోని ఆదివాసీలు మాట్లాడే ఆస్ట్రోఏషియాటిక్ భాషలలో ముండా శాఖకు చెందినది. భాషలపై యునెస్కో పటాల పుస్తకం, హోను భారతదేశంలో అంతరించిపోతోన్న భాషలలో ఒకటిగా జాబితా చేసింది

ఈ ప్రమాణపత్ర రచన ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో మాట్లాడే భాష గురించినది.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Video : Rahul Kumar

Rahul Kumar is a Jharkhand-based documentary filmmaker and founder of Memory Makers Studio. He has been awarded a fellowship from Green Hub India and Let’s Doc and has worked with Bharat Rural Livelihood Foundation.

Other stories by Rahul Kumar
Text : Ritu Sharma

Ritu Sharma is Content Editor, Endangered Languages at PARI. She holds an MA in Linguistics and wants to work towards preserving and revitalising the spoken languages of India.

Other stories by Ritu Sharma
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli