"మీరు వెలుగుతో పుట్టారు, మేం చీకటితో పుట్టాం," తన మట్టి ఇంటి బయట కూర్చొనివున్న నందరామ్ జామూన్కర్ అన్నారు. మేం 2024 సార్వత్రిక ఎన్నికలలో ఏప్రిల్ 26, 2024న వోటు వేయబోతున్న అమరావతి జిల్లాలోని ఖడిమాల్ గ్రామంలో ఉన్నాం. నందరామ్ చెప్తోన్న చీకటి అక్షరాలా నిజం; మహారాష్ట్రలోని ఈ ఆదివాసీ గ్రామానికి ఎన్నడూ విద్యుత్ సౌకర్యమన్నదే లేదు.

"ప్రతి ఐదేళ్ళకోసారి ఎవరో ఒకరు వచ్చి గ్రామానికి విద్యుత్ సౌకర్యాన్ని తెస్తామని వాగ్దానం చేస్తారు. విద్యుత్ సంగతి అలాగుంచి, వాళ్ళు కూడా తిరిగి కనిపించరు," అన్నారు 48 ఏళ్ళ నందరామ్. ప్రస్తుత ఎమ్‌పి నవనీత్ కౌర్ రాణా 2019లో శివ సేనకు చెందిన మాజీ కేంద్ర మంత్రి ఆనందరావ్ అద్సుల్‌ను ఓడించి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడామె అదే స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

చిఖల్‌దరా తాలుకా లోని ఈ గ్రామంలో ఉండే 198 కుటుంబాలు (2011 జనగణన), ప్రధానంగా మహాత్మాగాంధి దేశీయ ఉపాధి హామీ చట్టం (MNREGA)  పనులపై అధారపడతారు. భూమి ఉన్న కొద్దిమంది వర్షాధార వ్యవసాయం చేస్తూ ఎక్కువగా మొక్కజొన్నను పండిస్తారు. ఎక్కువగా షెడ్యూల్డ్ తెగలకు (ఎస్‌టిలు) చెందినవారు నివసించే ఖండిమాల్ గ్రామానికి తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు ఎన్నడూ లేవు. కొర్కు భాషలో మాట్లాడే నందరామ్, కొర్కు ఆదివాసీ తెగకు చెందినవారు. కొర్కు భాషను అంతరించిపోతున్న భాషగా ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వశాఖ 2019లో గుర్తించింది.

'మేం రాజకీయ నాయకులెవరినీ మా గ్రామంలోకి రానివ్వం. అనేక సంవత్సరాలుగా వాళ్ళు మమ్ముల్ని వెర్రివాళ్ళను చేస్తున్నారు, అదింక సాగదు'

"మార్పు కోసం మేం 50 ఏళ్ళుగా వోటు వేస్తూనే ఉన్నాం, కానీ మేం వంచనకు గురయ్యాం," అంటారు నందరామ్ పక్కనే కూర్చొని ఆయన్ని ఊరడిస్తోన్న దినేశ్ బేల్కర్. ఆయన తన ఎనిమిదేళ్ళ కొడుకును 100 కిలో మీటర్ల దూరాన ఉన్న బోర్డింగ్ పాఠశాలకు పంపించాల్సివచ్చింది. గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉన్నప్పటికీ, సరైన రహదారులు, రవాణా సౌకర్యం లేకపోవటంతో ఉపాధ్యాయులు సక్రమంగా బడికి రావటంలేదు. "వాళ్ళు వారంలో రెండుసార్లు వస్తారు," దినేశ్ (35) చెప్పారు.

"రాష్ట్ర రవాణా బస్సుల సౌకర్యాన్ని కల్పిస్తామని వాగ్దానం చేస్తూ ఇక్కడకు అనేకమంది [నాయకులు] వచ్చారు, కానీ ఎన్నికలు అయిపోగానే వాళ్ళు మాయమైపోతారు," అన్నాడు రాహుల్. రవాణా సౌకర్యం లేనందున తన పత్రాలను సకాలంలో సమర్పించలేకపోవటంతో 24 ఏళ్ళ ఈ ఎమ్ఎన్ఆర్ఇజిఎ శ్రామికుడు తన కళాశాల చదువును నిలిపివేయాల్సి వచ్చింది. " చదువు గురించి మేం పూర్తిగా ఆశలు వదిలేసుకున్నాం," అంటాడు రాహుల్.

"చదువు సంగతి తర్వాత, ముందు మాకు నీళ్ళు కావాలి," ఉద్వేగం తన్నుకురావడంతో గొంతు పెద్దదిచేసి చెప్పారు నందరామ్. ఎగువ మేల్‌ఘాట్ ప్రాంతం చాలా కాలంగా తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది.

PHOTO • Swara Garge ,  Prakhar Dobhal
PHOTO • Swara Garge ,  Prakhar Dobhal

ఎడమ: మహరాష్ట్ర, అమరావతి జిల్లాలోని ఖడిమాల్ గ్రామవాసులు నందరామ్ జామున్కర్ (పసుపు రంగు), దినేశ్ బేల్కర్ (నారింజ రంగు స్కార్ఫ్). ఈ గ్రామానికి నీరు, విద్యుత్ సౌకర్యాలు అసలే లేవు. కుడి: దాదాపు పూర్తిగా ఎండిపోయిన ఏరు. ఇది గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే, వర్షాకాలంలో ఈ ప్రాంతంలోని నీటి తావులన్నీ పొంగిపోయి, రహదారులనూ వంతెనలనూ పాడుచేస్తాయి. వాటికి మరమ్మత్తులు చేయటం ఎప్పుడో గాని జరగదు

గ్రామస్థులు ప్రతి రోజూ 10-15 కిలోమీటర్ల దూరం నుంచి నీళ్ళు తెచ్చుకోవాలి. ఈ పనిని ఎక్కువగా మహిళలే చేస్తారు. గ్రామంలోని ఏ ఇంటికీ కుళాయి లేదు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరాన ఉన్న నవల్‌గాఁవ్ నుంచి నీటి గొట్టాలను వేసింది. కానీ దీర్ఘమైన వేసవి నెలలలో ఈ పైపుల నుంచి నీటి సరఫరా ఉండదు. బావుల నుంచి తెచ్చుకునే నీరు తాగటానికి పనికిరావు. "ఎక్కువ కాలం, మేం మట్టిరంగులో ఉన్న నీటినే తాగుతాం," అన్నారు దినేశ్. అలా తాగటం వలన గతంలో అది, ప్రతేకించి గర్భవతులలోనూ పిల్లల్లోనూ డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు చెలరేగటానికి దారితీసింది.

ఖడిమాల్ మహిళలకు తెల్లవారు ఝామున మూడు లేదా నాలుగు గంటలకు నిద్రలేచి నీళ్ళు తెచ్చుకోవటానికి చాలా దూరాలు నడవటంతో రోజు మొదలవుతుంది. "మేం అక్కడికి చేరుకునే సమయాన్ని బట్టి మూడు నుంచి నాలుగు గంటలపాటు వరసలో నిలబడాల్సివస్తుంది," అంటారు నమ్య రామాధికర్. అన్నిటికంటే అతి సమీపంలో ఉన్న చేతిపంపు అక్కడికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. నదులు ఎండిపోవటంతో దాహంతో ఉన్న ఎలుగుబంట్ల వంటి అడవి జంతువులు సంచరించే స్థలంగా ఈ ప్రదేశం మారిపోయింది. ఒకోసారి ఎగువ మేల్‌ఘాట్‌లో ఉన్న సేమాడో టైగర్ రిజర్వ్ నుంచి పులులు కూడా ఇక్కడకు నీటి కోసం వస్తుంటాయి.

నీళ్ళు తెచ్చుకోవటమే రోజులో చేసే మొదటి పని. ఎమ్ఎన్ఆర్ఇజిఎ పని ప్రదేశానికి ఉదయం 8 గంటలకంతా వెళ్ళాలంటే నమ్య వంటి మహిళలు అప్పటికే మొత్తం ఇంటి పనినంతా పూర్తిచేసుకోవాలి. సాయంత్రం వరకు, రోజంతా భూమిని దున్నటం, బరువైన నిర్మాణ వస్తువులను మోస్తూ తీసుకెళ్ళటం వంటి పనులు చేసివచ్చాక, మళ్ళీ రాత్రి 7 గంటల సమయంలో వాళ్ళు నీళ్ళు తెచ్చుకోవాలి. "మాకు విశ్రాంతి అన్నది దొరకదు. మేం అనారోగ్యంతో ఉన్నా, గర్భంతో ఉన్నా కూడా నీళ్ళు తెచ్చుకోవాల్సిందే," అంటుంది నమ్య. "బిడ్డను కన్న తర్వాత కూడా, మాకు రెండు మూడు రోజులకు మించి విశ్రాంతి దొరకదు."

PHOTO • Swara Garge ,  Prakhar Dobhal
PHOTO • Prakhar Dobhal

ఎడమ: అనేక సంవత్సరాలుగా తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటోన్న ఈ ఎగువ మేల్‌ఘాట్ ప్రాంతంలో, రోజుకు రెండుసార్లు నీటిని మోసుకొచ్చే భారాన్ని మహిళలే మోస్తున్నారు. 'మేం అక్కడికి ఎప్పుడు చేరుకున్నామనే దానిని బట్టి మూడు నుండి నాలుగు గంటల పాటు వరసలో నిలబడాల్సి ఉంటుంది,' నమ్య రామాధికర్ చెప్పింది. కుడి: అన్నిటికంటే దగ్గరగా ఉండే చేతి పంపు గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది

PHOTO • Prakhar Dobhal
PHOTO • Swara Garge ,  Prakhar Dobhal

ఎడమ: గ్రామస్థులలో చాలమంది ఎమ్ఎన్ఆర్ఇజిఎ పని ప్రదేశాలలో పనిచేస్తారు. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదు. ఒక ప్రాథమిక పాఠశాల ఉన్నప్పటికీ అందులో తరగతులు సక్రమంగా జరగవు. కుడి: చివరకు బిడ్డను కన్న తర్వాత కూడా మహిళలకు పని నుంచి విశ్రాంతి ఉండదని చెప్తోన్న రమ్య రామాధికర్

ఈ ఏడాది ఎన్నికలు సమీపిస్తుండటంతో, నమ్య చాలా స్పష్టమైన వైఖరిని తీసుకుంది. "ఊర్లోకి కుళాయి వచ్చేంతవరకూ నేను వోటు వేయను."

మిగిలిన గ్రామస్థులు కూడా ఆమె వైఖరినే ప్రతిధ్వనించారు.

"మాకు రోడ్లు, కరెంటు, నీళ్ళు వచ్చేవరకూ మేం వోటు వెయ్యం," అన్నారు ఖడిమాల్ మాజీ సర్పంచ్, 70 ఏళ్ళ బబ్నూ జామున్కర్. అనేక సంవత్సరాలుగా వాళ్ళు మమ్మల్ని వెర్రివాళ్ళను చేశారు, మరింక చేయలేరు."

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Student Reporter : Swara Garge

Swara Garge is a 2023 PARI intern and a final year Masters student from SIMC, Pune. She is a visual storyteller interested in rural issues, culture and economics.

Other stories by Swara Garge
Student Reporter : Prakhar Dobhal

Prakhar Dobhal is a 2023 PARI intern pursuing a Master's degree from SIMC, Pune. Prakhar is an avid photographer and documentary filmmaker interested in covering rural issues, politics and culture.

Other stories by Prakhar Dobhal
Editor : Sarbajaya Bhattacharya

Sarbajaya Bhattacharya is a Senior Assistant Editor at PARI. She is an experienced Bangla translator. Based in Kolkata, she is interested in the history of the city and travel literature.

Other stories by Sarbajaya Bhattacharya
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli