బజరంజ్ గాయక్వాడ్ ఐదు కిలోల బరువు తగ్గినప్పుడే, జరగాల్సిన నష్టం జరిగిపోయిందని గ్రహించారు. “ఇంతకుముందు నేను ప్రతిరోజూ ఆరు లీటర్ల గేదె పాలు తాగేవాడిని; 50 బాదంపప్పులు, 12 అరటిపండ్లు, రెండు గుడ్లు, అలాగే రోజు మార్చి రోజు మాంసం తినేవాడిని.” అన్నారాయన. ఇప్పుడు, వాటినతను వారం రోజులలో, లేదా అంతకన్నా ఎక్కువ రోజులపాటు తింటున్నారు. దాంతో అతని బరువు 61 కిలోలకు పడిపోయింది.

"ఒక మల్లయోధుడు బరువు తగ్గకూడదు. అది మమ్మల్ని బలహీనపరుస్తుంది. కుస్తీ పట్టేటపుడు మంచి పోరాటాన్నివ్వడం కష్టమవుతుంది. అందుకే, శిక్షణలాగే ఖురాక్ (ఆహారం) కూడా మాకు చాలా ముఖ్యం,” అని కొల్హాపూర్ జిల్లా జునే పారగాఁవ్ గ్రామానికి చెందిన 25 ఏళ్ళ పహల్వాన్ బజరంగ్ నొక్కి చెప్పారు. పశ్చిమ మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఇతర మల్లయోధుల్లాగానే బజరంగ్ కూడా తన భారీ భోజనం కోసం చాలాకాలంగా ఎర్రమట్టి మైదానాల్లో కుస్తీ పట్టి గెలుచుకున్న సంపాదనపైనే ఆధారపడివున్నారు.

అయితే, కొల్హాపూర్‌లోని దొనోలి గ్రామంలో జరిగిన చివరి మైదాన్ (పోటీ)లో బజరంగ్ పాల్గొని 500 రోజులకు పైనే అయింది. “ఘోరంగా గాయమైనప్పుడు కూడా నేనింత సుదీర్ఘ విరామం తీసుకోలేదు!” అన్నారు బజరంగ్.

Left: Bajrang and his mother, Pushpa Gaikwad; their house was flooded in July 2021. Right: Coach Maruti Mane inspecting the rain-ravaged taleem. The floods came after a year-plus of no wrestling bouts due the lockdowns
PHOTO • Sanket Jain
Left: Bajrang and his mother, Pushpa Gaikwad; their house was flooded in July 2021. Right: Coach Maruti Mane inspecting the rain-ravaged taleem. The floods came after a year-plus of no wrestling bouts due the lockdowns
PHOTO • Sanket Jain

ఎడమ: బజరంగ్, అతని తల్లి పుష్ప గాయక్వాడ్. జూలై 2021లో వచ్చిన వరదలో వారి ఇల్లు జలమయమైంది; కుడి: వర్షం వల్ల దెబ్బతిన్న తాలీమ్‌ను (శిక్షణా స్థలం) పరిశీలిస్తున్న కోచ్ మారుతీ మానే. ఏడాదికి పైగా ఉన్న లాక్‌డౌన్‌ల కారణంగా కుస్తీ పోటీలు జరగడంలేదు; ఆ తర్వాత వరదలు వచ్చాయి

మార్చి 2020 నుండి కుస్తీ పోటీలు నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌లు అమలులో ఉన్నప్పుడు, మహారాష్ట్ర అంతటా గ్రామాలలో జాత్ర (జాతరలు)లను కూడా నిషేధించారు. ఈ నిషేధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

కోవిడ్-19 విజృంభణకు ముందటి మల్లయుద్ధాల సీజన్‌లో పశ్చిమ మహారాష్ట్ర, ఉత్తర కర్నాటకలకు చెందిన గ్రామాలలో జరిగిన వివిధ పోటీలలో బజరంగ్ రూ.1,50,000 వరకు గెలుచుకున్నారు. ఆ సంవత్సరానికి అది అతని మొత్తం ఆదాయం. ఒక మంచి మల్లయోధుడు ఒక సీజన్‌లో కనీసం 150 మ్యాచ్‌లలో పోటీ చేయగలడని బజరంగ్ అన్నారు. ఈ సీజన్ అక్టోబర్ చివరి నుండి ఏప్రిల్-మే వరకు (ఋతుపవనాలు వచ్చేముందు వరకు) ఉంటుంది. ఒక సీజన్లో ఔత్సాహిక యోధులు రూ.50,000 వరకూ, అనుభవజ్ఞులైన మల్లయోధులు రూ.20 లక్షల వరకు సంపాదించుకుంటారని బజరంగ్‌కు వస్తాద్ (శిక్షకుడు) అయిన 51 ఏళ్ళ మారుతీ మానే వివరించారు.

లాక్‌డౌన్ ప్రారంభం కావటానికి ముందే, ఆగస్టు 2019లో పశ్చిమ మహారాష్ట్ర, కొంకణ్‌లలోని కొన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తినప్పుడు, హాత్‌కణంగలే తాలూకా లోని జునే పారగాఁవ్ వాస్తవ్యులైన బజరంగ్, ఇతర పహల్వాన్లు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వరుసగా మూడు రోజులు కురిసిన వర్షాలకు వారణా నది ఉత్తర ఒడ్డున ఉన్న జునే పారగాఁవ్ (పాతది), పారగాఁవ్ గ్రామాలు జలమయమయ్యాయి. ఆ గ్రామాలలో మొత్తం (2011 జనాభా లెక్కల ప్రకారం) 13,130 మంది నివసిస్తున్నారు.

With the lockdown restrictions, even taleems – or akhadas – across Maharashtra were shut. This impacted the pehelwans' training, and the increasing gap between training and bouts has forced many of them to look for other work
PHOTO • Sanket Jain
With the lockdown restrictions, even taleems – or akhadas – across Maharashtra were shut. This impacted the pehelwans' training, and the increasing gap between training and bouts has forced many of them to look for other work
PHOTO • Sanket Jain

లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా మహారాష్ట్ర అంతటా తాలీమ్‌లు/అఖాడాలు మూతపడ్డాయి. ఇది పహల్వాన్ల శిక్షణపై ప్రభావం చూపించింది; శిక్షణ-పోటీల మధ్య అంతరం పెరిగిపోయి, వారిలో చాలామంది వేరే పనుల కోసం వెతుక్కోవాల్సివచ్చింది

జునే పారగాఁవ్ లోని జై హనుమాన్ తాలీమ్ కూడా మునిగిపోయింది. మారుతీ మానే అంచనా ప్రకారం ఈ తాలీమ్ వయసు వంద సంవత్సరాలకు పైమాటే. ఇక్కడివారితో సహా సమీప గ్రామాలకు చెందిన 50 మందికి పైగా మల్లయోధులు (అందరూ పురుషులే) 23X 20 అడుగుల వైశాల్యమున్న శిక్షణా మందిరంలోని ఐదు అడుగుల లోతైన గోదా (కుస్తీలు పట్టే ప్రదేశం)ని పునర్నిర్మించడానికి సాంగ్లీ జిల్లా నుండి 27,000 కిలోల తాంబడీ మాటీ (ఎర్రమట్టి)ని ట్రక్కులలో తీసుకువచ్చారు. అందుకు వారికి రూ. 50,000 ఖర్చయింది.

అయితే, లాక్‌డౌన్ ఆంక్షల వలన మహారాష్ట్ర అంతటా తాలీమ్‌లు , లేదా అఖాడాలు మూతపడ్డాయి. ఇది బజరంగ్, ఇంకా ఇతర మల్లయోధుల శిక్షణపై తీవ్ర ప్రభావం చూపింది. దీనికి తోడు, శిక్షణ-పోటీల మధ్య అంతరం పెరిగిపోతుండడంతో, వారిలో చాలామంది వేరే పనుల కోసం వెతుక్కోవాల్సివచ్చింది.

జూన్ 2021లో, బజరంగ్ కూడా తన ఇంటికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆటోమొబైల్స్ విడిభాగాల కర్మాగారంలో కార్మికుడిగా పనిచేయసాగారు. “నాకు నెలకు రూ.10,000 వస్తుంది. నా ఖురాక్ కోసం కనీసం రూ.7000 అవసరమవుతుంది,” అని బజరంగ్ అన్నారు. ప్రతిభావంతులైన మల్లయోధులు ప్రతిరోజూ ఖురాక్ కోసమే రూ.1,000 వరకు ఖర్చుపెట్టాల్సి ఉంటుందని అతని కోచ్ మారుతీ మానే చెప్పారు. అలా సాధ్యపడక, ఆగస్ట్ 2020 నుండి, బజరంగ్ తాను తీసుకునే ఆహారం పరిమాణాన్ని తగ్గిముచుకున్నారు. దాంతో అతను బరువు తగ్గసాగారు.

'ఇప్పుడు మల్లయోధులెవరూ కనీసం రెండు నెలల పాటు శిక్షణ పొందలేని పరిస్థితి ఉంద'ని కోచ్ మానే తెలిపారు. ‘ముందు, మొత్తం మాటి(మట్టి)ని ఒక నెల రోజుల పాటు ఎండనివ్వాలి’

వీడియో చూడండి: వరదలు, లాక్‌డౌన్లు, మరెన్నింటితోనో కుస్తీ పట్లు

వ్యవసాయ కూలీ అయిన తన తండ్రి 2013లో మరణించాక, బజరంగ్ రకరకాల పనులు చేశారు. కొంతకాలం స్థానిక పాల సహకార సంఘంలో ప్యాకేజింగ్ పనులు చేసి, రోజుకు రూ.150, తాగినన్ని పాలు సంపాదించేవారు.

అఖాడాల వరకు సాగిన బజరంగ్ ప్రయాణంలో 50 ఏళ్ళ అతని తల్లి పుష్ప అతనికి మద్దతుగా నిలిచారు. బజరంగ్ 12 ఏళ్ళ వయసులో స్థానికంగా జరిగిన పోటీలో మొదటిసారిగా పాల్గొన్నారు. “వ్యవసాయ కూలీగా పని చేస్తూ (ఆరు గంటల పనికి రూ.100 సంపాదిస్తూ) అతనిని మల్లయోధుడిగా తయారుచేశాను. కానీ, (మళ్ళీ మళ్ళీ వస్తున్న) వరదల వల్ల పొలం పనులు లేక ఇప్పుడు ఇబ్బందిగా ఉంది,” అని ఆమె బాధపడ్డారు.

ఇప్పుడు బజరంగ్ చేసే ఉద్యోగంలో వెన్ను విరిగేంత పని ఉంటోంది. అతను తప్పనిసరిగా చేయాల్సిన వ్యాయామాల సమయాన్ని కూడా అదే మింగేస్తోంది. " తాలీమ్‌ కు వెళ్ళాలని అనిపించని రోజులను కూడా నేను చూశాను," అని ఆయన గుర్తు చేసుకున్నారు. మార్చి 2020 నుండి ఈ అఖాడాలు మూసివేయబడినప్పటికీ, కొంతమంది పహల్వాన్లు అప్పుడప్పుడూ ఇక్కడ శిక్షణ పొందుతున్నారు.

Though Juney Pargaon village's taleem is shut since March 2020, a few wrestlers continue to sometimes train inside. They first cover themselves with red soil to maintain a firm grip during the bouts
PHOTO • Sanket Jain

మార్చి 2020 నుండి జునే పారగాఁవ్ లోని తాలీమ్ మూసివేయబడినప్పటికీ, కొంతమంది మల్లయోధులు అప్పుడప్పుడూ ఇక్కడ శిక్షణను కొనసాగిస్తున్నారు. పోటీల సమయంలో గట్టి పట్టు ఉండేలా కాపాడుకోవడానికి, మొదట వారు తమ ఒళ్ళంతా ఎర్రమట్టిని పూసుకుంటారు

తాలీమ్‌ ను అతి తక్కువగా ఉపయోగించిన ఒక ఏడాది తర్వాత, మల్లయోధులు తిరిగి మే 2021లో, మళ్లీ మట్టి పొరలు వేసి అఖాడా ను సిద్ధం చేయడం ప్రారంభించారు. ఎర్రమట్టిలో 520 లీటర్ల గేదె పాలు, 300 కిలోల పసుపు పొడి, 15 కిలోల కర్పూరం పొడి, సుమారు 2,500 నిమ్మకాయల రసం, 150 కిలోల ఉప్పు, 180 లీటర్ల వంట నూనె, 50 లీటర్ల వేపాకు నీళ్లు కలిపారు. ఇలా చేస్తే గాయాలు, శరీరం పై కోతలు, ఇన్ఫెక్షన్లు తమను ఇబ్బంది పెట్టవని వాళ్ళ నమ్మకం. ఈ మల్లయోధులు ఇందుకోసం కొంతమంది స్థానిక మద్దతుదారుల సహాయంతో ఒక లక్ష రూపాయలు పోగుచేశారు.

కానీ రెండు నెలల తర్వాత, జూలై 23న, వారి గ్రామాన్ని మరోసారి వర్షాలు, వరద నీరు ముంచెత్తాయి. “2019లో, తాలీమ్‌ లో వరద నీరు 10 అడుగులు వరకు వస్తే, 2021లో అది 14 అడుగులు దాటింది. మేం (మళ్లీ) స్వచ్చందంగా నిధులు ఇచ్చే స్థితిలో లేమని, నేను పంచాయితీ సహాయం అడిగాను. కానీ ఎవరూ ముందుకు రాలేదు,” అని  బజరంగ్ గుర్తు చేసుకున్నారు.

"ఇప్పుడు మల్లయోధులెవరూ కనీసం రెండు నెలల పాటు శిక్షణ పొందలేని పరిస్థితి. మొదట, ఈ మాటి (బురద)ని నెల రోజుల పాటు ఎండనివ్వాలి. ఆ తర్వాత మళ్ళీ కొత్తగా మాటి ని కొనాల్సివుంటుంది" అని కోచ్ మానే వివరించారు.

A pehelwan from Juney Pargaon climbing a rope, part of a fitness regimen. 'If you miss even a day of training, you go back by eight days', says Sachin Patil
PHOTO • Sanket Jain

ఫిట్‌నెస్ నియమావళిలో భాగంగా, తాడు ఎక్కుతున్న జునే పారగాఁవ్‌కు చెందిన ఒక పహల్వాన్; 'ఒక రోజు శిక్షణకు వెళ్ళకపోతే, ఎనిమిది రోజుల శిక్షణను కోల్పోయినట్లు,' అని సచిన్ పాటిల్ తెలిపారు

ఈ టైమ్-గ్యాప్ వల్ల ముందుముందు మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. “ఒక రోజు శిక్షణకు వెళ్ళకపోతే, ఎనిమిది రోజుల శిక్షణను కోల్పోయినట్టు,” అన్నారు, ప్రతిష్టాత్మక కేసరి కుస్తీ పోటీలలో పాల్గొన్న 29 ఏళ్ళ సచిన్ పాటిల్. ఈ టోర్నమెంట్‌ను మహారాష్ట్ర స్టేట్ రెజ్లింగ్ అసోసియేషన్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో, నవంబర్-డిసెంబర్‌ నెలలలో నిర్వహిస్తుంది. ఫిబ్రవరి 2020లో అతను హర్యానాలో ఏడు పోటీలలో గెలిచారు. “ఇది మంచి సీజన్, నేను రూ.25,000 గెలిచాను.” అన్నారు పాటిల్.

సచిన్ నాలుగేళ్ళుగా వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నారు. అప్పుడప్పుడూ పొలాల్లో రసాయన ఎరువులు చల్లే పని చేస్తూ, నెలకు దాదాపు రూ.6,000 సంపాదిస్తున్నారు. ఇంతకుముందు అతను కొల్హాపూర్ జిల్లాలోని వారణ చక్కెర సహకార సంఘం నుండి కొంత సహాయాన్ని - నెలకు రూ.1,000 భత్యం, ప్రతిరోజూ ఒక లీటరు పాలు, బస చేయడానికి ఇల్లు - పొందారు (కొన్నిసార్లు మంచి ప్రతిభను ప్రదర్శించిన యువ మల్లయోధులు రాష్ట్రంలోని చక్కెర, పాల సహకార సంఘాల నుండి అటువంటి సహకారాన్ని పొందుతారు. 2014-2017 మధ్యకాలంలో బజరంగ్ కూడా అలాంటి సహకారాన్ని పొందినవారే.)

మార్చి 2020కి ముందు, పహల్వాన్లు ప్రతిరోజూ ఉదయం 4.30 నుండి 9 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 5.30 గంటల నుండి శిక్షణ పొందేవారు. "కానీ లాక్‌డౌన్ సమయంలో వారు సరైన శిక్షణ పొందలేకపోయారు. ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది," అన్నారు కోచ్ మానే. మళ్లీ పోటీలలో పాల్గొనేందుకు వీరికి కనీసం నాలుగు నెలల కఠిన శిక్షణ అవసరమని ఆయన అంచనా. 2019 మధ్య నుండి మొదలుకొని గడిచిన ఈ రెండేళ్ళలో- రెండుసార్లు ముంచెత్తిన వరదలు, కోవిడ్‌ల కారణంగా- తన అమూల్యమైన కుస్తీ సమయాన్ని కోల్పోయానని సచిన్ బాధపడ్డారు.

With this series of setbacks, the once-popular sport of kushti, already on a downslide, is in serious decline
PHOTO • Sanket Jain

ఒకప్పుడు జనాదరణ పొందిన కుస్తీ, ఈ వరుస ఎదురుదెబ్బలతో ఇప్పుడు పతనావస్థకు చేరుకుంది

“మల్లయోధులు 25-30 సంవత్సరాల వయసు వరకు మంచి ప్రతిభ చూపగలిగి ఉంటారు. ఆ తర్వాత కుస్తీని కొనసాగించడం కష్టమవుతుంది," అని 20 సంవత్సరాలకు పైగా కుస్తీ పట్టిన మానే వివరించారు. గత రెండు దశాబ్దాలుగా ఆయన ఒక స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. “గ్రామీణ మల్లయోధుడి జీవితం పోరాటాలతో, బాధలతో నిండి ఉంటుంది. కొంతమంది అత్యుత్తమ యోధులు కూడా ఇప్పుడు కార్మికులుగా పని చేస్తున్నారు!” అన్నారాయన.

ఒకప్పుడు జనాదరణ పొందిన కుస్తీ , ఈ వరుస ఎదురుదెబ్బలతో ఇప్పుడు పతనావస్థకు చేరుకుంది. మహారాష్ట్రలో పాలకుడు-సంఘ సంస్కర్త అయిన షాహూ మహారాజ్ (1890 చివరి నుండి) ఆరుబయట(ఓపెన్ ఎయిర్) కుస్తీ పోరాటాలకు ప్రాచుర్యం కలిగించారు. అఫ్ఘానిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్, టర్కీ, మరి కొన్ని ఆఫ్రికన్ దేశాల నుండి వచ్చిన పహల్వాన్ల కు గ్రామాల్లో చాలా డిమాండ్ ఉండేది. ( Kushti: the secular & the syncretic )

“ఒక దశాబ్దం క్రితం, జునే పారగాఁవ్‌లో కనీసం 100 మంది కుస్తీవీరులు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 55కు పడిపోయింది. శిక్షణ తీసుకోవడానికి ప్రజల దగ్గర డబ్బు లేదు,” అని మారుతి మానే చెప్పారు. ఈయన ధన్‌గర్ సామాజికవర్గానికి చెందిన మానే కుటుంబంలో, రెండవ తరం మల్లయోధుడు. ఈయన ఘున్కీ, కిణీ, నీలేవాడీ, పారగాఁవ్, జునే పారగాఁవ్ గ్రామాల నుండి వచ్చే విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.

'This year [2021], the floods were worse than 2019' says Bajrang, and the water once again caused widespread destruction in Juney Pargaon village
PHOTO • Sanket Jain
'This year [2021], the floods were worse than 2019' says Bajrang, and the water once again caused widespread destruction in Juney Pargaon village
PHOTO • Sanket Jain

2019తో పోలిస్తే, ఈ సంవత్సరం (2021) వరదలు దారుణంగా ఉన్నాయని, వరద నీరు మరోసారి జునే పారగాఁవ్ గ్రామాన్ని అతలాకుతలం చేసిందన్నారు బజరంగ్

కుస్తీ పోటీలలో అతను గెల్చుకున్న ట్రోఫీలు, వరద నీటి నుండి సురక్షితంగా, తాలీమ్‌ లోని ఒక ఎత్తైన అరమరను అలంకరించి ఉన్నాయి. ప్రళయం గురించి ఆయన ఇలా గుర్తు చేసుకున్నారు: “జులై 23న (2021), రాత్రి 2 గంటలకు మా ఇంటి నుండి బయలుదేరి దగ్గర్లోని పొలానికి వెళ్ళాం. వరద నీటి ఉధృతి పెరగడంతో, ఒక్క రోజులో గ్రామమంతా మునిగిపోయింది.” మానే కుటుంబం తమ ఆరు మేకలను, గేదెను సురక్షితంగా తరలించగలిగింది కానీ, 25 కోడి పెట్టలను మాత్రం కోల్పోయింది. జూలై 28న వరద నీరు తగ్గుముఖం పట్టిన తర్వాత, 20 మంది మల్లయోధులతో కలిసి మారుతి మొదటగా తాలీమ్‌ కే వెళ్ళారు; అక్కడ అంతా నాశనమైపోయివుంది.

ఇది యువతరం మల్లయోధులపై మరింత ప్రభావం చూపుతుందని అతనిప్పుడు ఆందోళన చెందుతున్నారు. 2018-19లో జరిగిన పోటీల్లో, సాంగ్లీ జిల్లాకు చెందిన 20 ఏళ్ళ బీఏ విద్యార్థి మయూర్ బాగడీ 10కి పైగా పోటీలలో గెలిచాడు. “నేను మరింత నేర్చుకొని ముందుకు సాగేలోపే లాక్‌డౌన్ నా సర్వస్వాన్నీ తీసుకుపోయింది,” అన్నాడతను. అప్పటి నుండి అతను తన కుటుంబానికి చెందిన రెండు గేదెల సంరక్షణను చూసుకుంటూ, తమ సాగు భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు.

ఫిబ్రవరి 2020లో, ఘున్కీ గ్రామంలో తాను చివరిగా చేసిన కుస్తీ పోటీలో రూ.2,000 గెలుచుకున్నారు. గెలిచిన మొత్తంలో విజేత 80 శాతం, ద్వితీయ విజేత 20 శాతం తీసుకుంటారని సచిన్ పాటిల్ వివరించారు. ఈ విధంగా చూస్తే ప్రతి పోటీలోనూ ఎంతో కొంత ఆదాయం వస్తుంది.

ఇటీవలి వరదలకు ముందు, మయూర్‌తో పాటు దగ్గరలోని నీలేవాడీ గ్రామానికి చెందిన మరో ముగ్గురు మల్లయోధులు తరచుగా అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జునే పారగాఁవ్‌కు వెళ్ళేవారు. “మా ఊరిలో తాలీమ్ లేదు.” అన్నాడు మయూర్.

Wrestler Sachin Patil’s house was damaged even in the 2005 and 2019 floods
PHOTO • Sanket Jain
Mayur Bagadi from Nilewadi has won over 10 bouts in two years.
PHOTO • Sanket Jain

ఎడమ: మల్లయోధుడైన సచిన్ పాటిల్ ఇల్లు 2005లోనూ, 2019 లోనూ వచ్చిన వరదలలో దెబ్బతిన్నది; కుడి: నీలేవాడీకి చెందిన మయూర్ బాగడీ రెండేళ్ళలో 10కి పైగా పోటీలు గెలిచారు

“గత నెల వరదల సమయంలో మేము ఒక రోజంతా మూడు అడుగుల నీటిలో ఉండిపోయాం. రక్షించబడిన తర్వాత నాకు జ్వరం వచ్చింది,” అని మయూర్ గుర్తు చేసుకున్నాడు. దాంతో బాగడీలు పారగాఁవ్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో వారం పాటు తల దాచుకున్నారు. “మా ఇల్లు మొత్తం మునిగిపోయింది; 10 గుంటల (0.25 ఎకరాల) వ్యవసాయ భూమి కూడా.” అన్నాడు మయూర్. ఆ కుటుంబం రూ.60,000 విలువ చేసే తమ 20 టన్నుల చెరుకు పంటపై ఆశ పెట్టుకుంది. ఇంట్లో నిల్వ చేసిన 70 కిలోల మొక్కజొన్న, గోధుమలు, బియ్యం కూడా మునిగిపోయాయి. “అంతా పోయింది!” అన్నాడు మయూర్

వరద తర్వాత, మయూర్ తన తల్లిదండ్రులకు (ఇద్దరూ రైతులు, వ్యవసాయ కూలీలు) ఇల్లు శుభ్రం చేయడంలో సహాయం చేశాడు, “ఎంతకీ దుర్వాసన పోదు; కానీ మేమిప్పుడు ఇక్కడే పడుకోవాలి, తినాలి!” అని మయూర్ వాపోయాడు.

మహారాష్ట్రని వరదలు అతలాకుతలం చేశాయి. “2005 వరదల కంటే, 2019లో వచ్చిన వరదలు ఎక్కువ బీభత్సం సృష్టించాయి. పైగా ఆ ఏడాది మాకు ఒక్క రూపాయి కూడా పరిహారం అందలేదు. ఈ సంవత్సరం (2021) వచ్చిన వరదలు 2019 వరదల కంటే ఘోరంగా ఉన్నాయి. “ప్రభుత్వం ఐపిఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్)కు మద్దతిచ్చి, ఆ మ్యాచ్‌లను వేరే దేశాలలో నిర్వహించాలని కూడా ఆలోచిస్తున్నపుడు, కుస్తీ గురించి ఎందుకు ఆలోచించదు?” అని బజరంగ్ ప్రశ్నించారు.

“ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎంతటి మల్లయొధుడితోనైనా నేను పోటీ పడగలను. కానీ, కోవిడ్‌తోనూ, రెండుసార్లు ముంచెత్తిన వరదలతో మాత్రం నేను కుస్తీ పట్టలేను!” అన్నారు సచిన్.

అనువాదం: వై. క్రిష్ణ జ్యోతి

Sanket Jain

Sanket Jain is a journalist based in Kolhapur, Maharashtra. He is a 2022 PARI Senior Fellow and a 2019 PARI Fellow.

Other stories by Sanket Jain
Translator : Y. Krishna Jyothi

Krishna Jyothi has 12 years of experience in journalism as a sub-editor & features writer. Now, she is into blogging.

Other stories by Y. Krishna Jyothi