"మా అబ్బూ (నాన్న) దినకూలీగా పనిచేసేవాడు. కానీ చేపలు పట్టడమంటేనే ఇష్టం. ఏవో తిప్పలుపడి కిలో బియ్యం కొనుక్కోవడానికి సరిపడా డబ్బు మాత్రమే ఇచ్చి పత్తా లేకుండా పోయేవాడు... మిగతా అవసరాలన్నీ మా అమ్మీ యే (అమ్మ) చూసుకోవాల్సి వచ్చేది," అన్నారు, బేల్‌డాంగాలోని ఉత్తర్‌పారా ప్రాంతంలో ఉన్న తన ఇంటి డాబాపైన కూర్చునివున్న కోహినూర్ బేగం..

‘‘ఆ కిలో బియ్యంతోనే మా అమ్మీ నలుగురు పిల్లల ఆకలి తీర్చాలి. మా దాదీ (నాయనమ్మ), మా అబ్బూ (నాన్న), మేనత్త, ఆమె కూడా తినాలి," అంటూ కాస్త ఆగి మళ్లీ అంది. దీనికి తోడు చేపలకు ఎరగా వెయ్యడానికి అన్నం కావాలంటాడు మా అబ్బూ . అలాంటి మనిషితో ఎలా వేగేది?"

కోహినూర్ ఆపా (అక్క)కు 55 ఏళ్లు. పశ్చిమ బెంగాల్, ముర్షీదాబాద్‌లోని జానకినగర్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారుచేసే వంటమనిషిగా పనిచేస్తున్నారు. ఖాళీ సమయంలో బీడీలు చుడుతుంటారు. బీడీ కార్మిక మహిళల హక్కుల కోసం పోరాడుతుంటారు. ముర్షీదాబాద్‌లో అత్యంత నిరుపేద మహిళలే ఈ శారీరక ఆరోగ్యాన్ని పాడుచేసే పనిని చేస్తుంటారు. చిన్న వయసు నుంచే నిరంతరం పొగాకుతో పనిచేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా చదవండి: పొగచూరిపోతున్న మహిళా బీడీ కార్మికుల ఆరోగ్యం

2021 డిసెంబర్ నెలలో ఓ ఉదయం, ఒక బీడీ కార్మికుల సమావేశానికి హాజరై వచ్చిన కోహినూర్ ఆపా , ఈ విలేకరితో మాట్లాడారు. ఆ తర్వాత, తన బాల్యం గురించి తీరుబడిగా చాలా ముచ్చట్లు చెప్పారు. తాను సొంతంగా బాణీ కట్టిన ఒక పాట - ఎంతో శ్రమతో కూడుకున్న పని అయిన బీడీలు చుట్టడం గురించి, అక్కడ కార్మికుల శ్రమను దోచుకునే పని పరిస్థితుల గురించీ - పాడారు.

తన బాల్యంలో కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండడంతో చాలా కష్టాలు పడ్డామని కోహినూర్ ఆపా చెప్పారు. అలాంటి పేదరికం ఓ బాలికకు దుర్భరంగా ఉంటుంది. "నాకు తొమ్మిదేళ్లున్నప్పుడు ఓ రోజు ఇంటిగోల నడమ అమ్మీ ఏడుస్తూ కనిపించింది. చుల్హా (మట్టిపొయ్యి)లో బొగ్గు, ఆవు పేడతో చేసిన పిడకలు, కట్టెలు వేసి మంట రాజేస్తోంది. వండటానికి ఇంట్లో చారెడు గింజలు కూడా లేవు."

ఎడమ: తన తల్లితో కోహినూర్ బేగమ్. సమాజంలో స్వంత స్థానం కోసం తల్లి చేసిన పోరాటం కోహినూర్‌ను ప్రేరేపించింది. కుడి: ముర్షిదాబాద్, బెర్హంపూర్‌లో డిసెంబర్ 2022లో జరిగిన ర్యాలీకి నాయకత్వం వహిస్తున్న కోహినూర్. ఫొటో సౌజన్యం: నశీమా ఖాతూన్

తొమ్మిదేళ్ల కోహినూర్‌కు చటుక్కున ఓ ఆలోచన వచ్చింది. "బొగ్గుల డిపో వ్యాపారి భార్య దగ్గరికి పరిగెట్టుకు వెళ్లి, ' కాకిమా, ఆమాకే ఏక్ మొన్ కొరె కోయ్‌లా దెబే రోజ్? ' (పిన్నీ, నాకు రోజూ కొన్ని బొగ్గులు ఇస్తావా?) అని అడిగాను," అని సగర్వంగా గుర్తుచేసుకున్నారు కోహినూర్. "మరీమరీ అడగడంతో ఆమె కాదనలేకపోయింది. నేను డిపో నుంచి రోజూ రిక్షాలో మా ఇంటికి బొగ్గులు తీసుకురావడం మొదలుపెట్టాను. రిక్షా బాడుగ 20 పైసలు."

జీవితం అలా గడిచిపోతూ ఉంది. పద్నాలుగేళ్లు వచ్చేసరికి కోహినూర్‌ తన గ్రామమైన ఉత్తరపారాలోనూ, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ నుసిబొగ్గు అమ్ముతోంది. ఆమె తన లేత భుజాలపై ఇరవై కేజీల బొగ్గుమూటను మోసుకెళ్లేది. "వచ్చేది రవంత ఆదాయమే అయినా అది మా తిండితప్పలకు సాయంగా ఉండేది." అన్నారు కోహినూర్.

ఇంటికి ఎంతోకొంత సాయం చేస్తున్న సంతోషం ఉన్నా జీవితంలో ఏదో కోల్పోయినట్లు కోహినూర్‌కు అనిపించేది. "నేను వీధిలో బొగ్గు అమ్ముతున్నప్పుడు బడులకు వెళ్లే అమ్మాయిలను, కాలేజీలకు ఆఫీసులకు వెళ్లే ఆడవాళ్లను చూసేదాన్ని. నాకు చాలా బాధ కలిగేది," గుర్తుచేసుకున్నారామె. కన్నీళ్లు ఆపుకుంటూ, బరువెక్కుతున్న గొంతుతో, "నేను కూడా భుజాలమీద సంచితో ఏదో బడికి వెళ్లాల్సినదాన్నే కదా," అన్నారు.

అప్పుడు ఓ బంధువు ఆమెకు మునిసిపాలిటీ నిర్వహిస్తోన్న స్థానిక స్వయం సహాయక మహిళా బృందాలను పరిచయం చేసింది. "బొగ్గు అమ్ముతూ ఇల్లిల్లూ తిరగడంతో నాకు చాలామంది ఆడవాళ్లు పరిచయమయ్యారు. వాళ్ల కష్టాలు నాకు తెలుసు. నన్నూ ఒక ఆర్గనైజర్‌గా తీసుకోవాలని మునిసిపాలిటీని గట్టిగా కోరాను."

కానీ ఓ సమస్య ఎదురైంది. ఆర్గనైజర్‌గా ఉండేవాళ్ళు లెక్కల పుస్తకాలను నిర్వహించాల్సి ఉంటుంది. కోహినూర్ చదువుకోలేదు కనుక ఆర్గనైజర్‌గా తీసుకోవడం కుదురదని ఆమె బంధువు చెప్పింది.

"నాకది సమస్యే కాదు. లెక్కలు వేయడం, మదింపు చేయడం నాకు బాగా వచ్చు. నుసి బొగ్గును అమ్ముతున్నప్పుడు నేనవన్నీ నేర్చుకున్నాను," అన్నారు కోహినూర్. తాను పొరపాట్లు చేయనని వారికి హామీ ఇచ్చింది. లెక్కలను ఆ బంధువు డైరీలో రాసిపెడితే "మిగతాదంతా నేను చేసుకుంటా," అని ఆమె ఆభ్యర్థించారు.

Kohinoor aapa interacting with beedi workers in her home.
PHOTO • Smita Khator
With beedi workers on the terrace of her home in Uttarpara village
PHOTO • Smita Khator

ఎడమ: తన ఇంటిలో బీడీ కార్మికులతో మాట్లాడుతున్న కోహినూర్ ఆపా. కుడి: ఉత్తరపారా గ్రామంలోని తన ఇంటి డాబాపైన బీడీ కార్మికులతో

అలాగే చేశారు కూడా. స్వయం సహాయక బృందాల కోసం పనిచేయడం వల్ల ఆ మహిళలందరి కష్టసుఖాలను బాగా అర్థం చేసుకునే అవకాశం కోహినూర్‌కు దొరికింది. వాళ్లలో అత్యధికులు బీడీలు చుట్టేవారు. పొదుపు చేయటం, కార్పస్ ఫండ్‌ను ఏర్పాటుచేయటం, ఆ ఫండ్ నుంచి అప్పు తీసుకుని తిరిగి చెల్లించడం వంటివాటి గురించి ఆమె చాలా నేర్చుకున్నారు.

డబ్బుకు ఎప్పుడూ కటకటే అయినా, క్షేత్రస్థాయిలో పనిచేయడం చాలా 'విలువైన అనుభవం'గా కోహినూర్ అంటారు. ఎందుకంటే, "నేను రాజకీయంగా అవగాహనను పెంచుకున్నాను. ఎక్కడన్నా తప్పు జరిగినట్లు తెలిస్తే ప్రజలతో వాదించేదాన్ని. కార్మిక సంఘాల కార్యకర్తలతో దగ్గర పరిచయాలను ఏర్పరుచుకున్నాను," అని చెప్పారామె..

కానీ ఇంట్లోవాళ్లకు, బంధువులకు ఇదేం పద్ధతిగా అనిపించలేదు. "అందుకని వాళ్ళు నాకు పెళ్లిచేశారు." పదహారేళ్ళ వయసులో ఆమెకు జమాలుద్దీన్ షేక్‌తో పెళ్ళయింది. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు.

అదృష్టవశాత్తూ తనకు ఇష్టమైన పనిని చేయడానికి కోహినూర్ ఆపాకి పెళ్లి అడ్డురాలేదు. "నా చుట్టుపక్కల ఏం జరుగుతోందో ప్రతివిషయాన్ని గమనిస్తూనే ఉన్నాను. నాలాంటి ఆడవాళ్ల కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే సంఘాలు ఉండటం నాకు ఎంతో నచ్చింది. వాటితో నా అనుబంధం పెరుగుతూపోయింది." జమాలుద్దీన్ ప్లాస్టిక్‌నూ చెత్తనూ సేకరిస్తుంటే, ఆమె బడిలో వంటపనితోనూ, ముర్షీదాబాద్ జిల్లా బీడీ కార్మికుల, ప్యాకర్ల సంఘం పనుల్లోనూ తీరిక లేకుండా, బీడీలు చుట్టే కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్నారు.

"ఒక్క ఆదివారపు ఉదయాలు మాత్రమే నాకు కాస్త ఖాళీ దొరుకుతుంది," పక్కనే ఉన్న సీసాలోంచి అరచేతిలోకి కొబ్బరినూనె ఒంపుకుంటూ చెప్పారామె. ఆ నూనెను ఒత్తయిన తన జట్టుకు పట్టించుకుని చక్కగా దువ్వుకున్నారు.

తల దువ్వుకున్న తర్వాత, ఒక దుపట్టాతో తలను కప్పుకొని, తన ముందున్న చిన్న అద్దంలో మొహాన్ని చూసుకున్నారు. "(నాకీరోజు పాటలు పాడాలని ఉంది) ఏక్‌టా బీడీ బాఁధయేర్ గాన్ శొనాయ్ (బీడీలు చుట్టటం గురించి ఒక పాట పాడతాను...)".

వీడియో చూడండి: శ్రమ గురించి కోహినూర్ ఆపా పాడుతున్న పాట

বাংলা

একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই

শ্রমিকরা দল গুছিয়ে
শ্রমিকরা দল গুছিয়ে
মিনশির কাছে বিড়ির পাতা আনতে যাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই

পাতাটা আনার পরে
পাতাটা আনার পরে
কাটার পর্বে যাই রে যাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই

বিড়িটা কাটার পরে
পাতাটা কাটার পরে
বাঁধার পর্বে যাই রে যাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই
ওকি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই

বিড়িটা বাঁধার পরে
বিড়িটা বাঁধার পরে
গাড্ডির পর্বে যাই রে যাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই

গাড্ডিটা করার পরে
গাড্ডিটা করার পরে
ঝুড়ি সাজাই রে সাজাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই

ঝুড়িটা সাজার পরে
ঝুড়িটা সাজার পরে
মিনশির কাছে দিতে যাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই

মিনশির কাছে লিয়ে যেয়ে
মিনশির কাছে লিয়ে যেয়ে
গুনতি লাগাই রে লাগাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই

বিড়িটা গোনার পরে
বিড়িটা গোনার পরে
ডাইরি সারাই রে সারাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই

ডাইরিটা সারার পরে
ডাইরিটা সারার পরে
দুশো চুয়ান্ন টাকা মজুরি চাই
একি ভাই রে ভাই
দুশো চুয়ান্ন টাকা চাই
একি ভাই রে ভাই
দুশো চুয়ান্ন টাকা চাই
একি মিনশি ভাই
দুশো চুয়ান্ন টাকা চাই।

తెలుగు

వినరో అన్నా వినరో అన్నా
మా పాటను, మా బీడీ పాటను

కూలోళ్లం కలిసి కూలోళ్లం కలిసి
ఆకుల కోసం దళారికాడికి వెళ్తాము
వినరో అన్నా వినరో అన్నా
మా పాటను, మేం పాడే బీడీ పాటను

ఆకులు తెచ్చి ఆకులు తెచ్చి
గుండ్రంగా కత్తిరిస్తాము గుండ్రంగా కత్తిరిస్తాము
వినరో అన్నా వినరో అన్నా
మా పాటను, మేం పాడే బీడీ పాటను

ఆకులు కత్తిరించి ఆకులు కత్తిరించి
చుట్టలు చుడతాము చుట్టలు చడతాము
వినరో అన్నా వినరో అన్నా
మా పాటను, మేం పాడే బీడీ పాటను

బీడీలు చుట్టి బీడీలు చుట్టి
కట్టలు కడతాము కట్టలు కడతాము
వినరో అన్నా వినరో అన్నా
మా పాటను, మేం పాడే బీడీ పాటను

కట్టలు కట్టి కట్టలు కట్టి
గంపలకెత్తి గంపలకెత్తి
వినరో అన్నా వినరో అన్నా
మా పాటను, మేం పాడే బీడీ పాటను

గంపలకెత్తి గంపలకెత్తి
దళారికాడికి వెళ్తాము దళారికాడికి వెళ్తాము
వినరో అన్నా వినరో అన్నా
మా పాటను, మేం పాడే బీడీ పాటను

దళారికాడికి వెళ్లి దళారికాడికి వెళ్లి
లెక్కలు కడతాము, లెక్కలు కడతాము
వినరో అన్నా వినరో అన్నా
మా పాటను, మేం పాడే బీడీ పాటను

లెక్కలు కట్టి లెక్కలు కట్టి
బుక్కులో రాస్తాము బుక్కులో రాస్తాము
వినరో అన్నా వినరో అన్నా
మా పాటను, మేం పాడే బీడీ పాటను

బుక్కూ నిండె బుక్కూ నిండె
మా కూలి ఇవ్వన్నో, మా పాట వినవన్నో
వినరో అన్నా వినరో అన్నా
కూలికై పాడే మా పాటను
రొండొందల యాబైనాలుగు చిల్లర కూలి
వినవో అన్నో, ఇవ్వవో అన్నో
రొండొందల యాబైనాలుగు చిల్లర
మా కూలి మాకిస్తే అంతే చాలును..

ఫాట సౌజన్యం:

బెంగాలీ పాట : కోహినూర్ బేగమ్

అనువాదం: వికాస్

Smita Khator

Smita Khator, originally from Murshidabad district of West Bengal, is now based in Kolkata, and is Translations Editor at the People’s Archive of Rural India, as well as a Bengali translator.

Other stories by Smita Khator
Editor : Vishaka George

Vishaka George is a Bengaluru-based Senior Reporter at the People’s Archive of Rural India and PARI’s Social Media Editor. She is also a member of the PARI Education team which works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Vishaka George
Video Editing : Shreya Katyayini

Shreya Katyayini is a Video Coordinator at the People's Archive of Rural India, and a photographer and filmmaker. She completed a master's degree in Media and Cultural Studies from the Tata Institute of Social Sciences, Mumbai, in early 2016.

Other stories by Shreya Katyayini
Translator : Vikas

Vikas works as a journalist in Telugu print media

Other stories by Vikas