“మూడు వేల సార్లు దీనిని కొట్టాలి.” ఈ మాటలు అన్న వెంటనే మీనాక్షి అదే పని చేయడం ప్రారంభిస్తుంది. ఆ దెబ్బలు తింటున్న వస్తువు వంటకు ఉపయోగించే మట్టి పాత్రల్లాంటి, ఇంకా కొలిమిలో కాల్చని ఒక మట్టి కుండ. అయితే, ఆ కుండ ఆమె చేతుల్లో దెబ్బలు తిని రూపు మార్చుకుని ఒక లయ వాయిద్యంగా మారుతుంది.

కుండని తన ఒళ్లో పెట్టుకుని పెద్ద కర్ర గరిటెతో అటూ ఇటూ చరచడం మొదలుపెడుతుంది మీనాక్షి. ఆ పని పూర్తయ్యే సరికి, కుండ ఘటంగా మారుతుంది. దక్షిణ భారత కర్ణాటక సంగీత కచ్చేరీలలో తప్పనిసరిగా ఉపయోగించే అతి సున్నితమైన లయ పలికే వాయిద్యం ఘటం. అరవై మూడు సంవత్సరాల మీనాక్షి కేశవన్ నిపుణురాలైన ఘటం తయారీదారు. మనమదురై అనే ఒక ప్రత్యేకమైన ఘటం తయారు చేసే కుటుంబం బహుశా ఇంక  మీనాక్షి కుటుంబం మాత్రమే మిగిలి ఉందేమో.

తమిళనాడులో మదురై నుంచి సుమారు గంట ప్రయాణం చేస్తే మీనాక్షి స్వస్థలం మనమదురై చేరతాం. ఆ ఊరు ఘటం తయారీకి ప్రసిద్ధి. “పదిహేనేళ్ళ వయసులో నన్ను నాలుగు తరాల నుంచి ఘటాలు చేస్తున్న కుటుంబంలో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు.” తన భర్త, మామగారి దగ్గర ఘట చేయడం నేర్చుకుంది మీనాక్షి. “ఈ పని చక్కగా రావడానికి ఆరేళ్ళు పడుతుంది,” మీనాక్షి కుమారుడు రమేష్ చెప్తాడు. అది చాలా వేగంగా నేర్చుకోగలిగే వారికి. “కుమ్మరి కుటుంబానికి చెందిన వారు కాకపోతే ఇంకా చాలా సమయం పడుతుంది.”

“స్వరం సరిగా వచ్చేలా ఘటాన్ని తయారు చేయడం అసలు కష్టమైన పని," తన కుడి చేతితో ఘటం పక్కల చరుస్తూ వివరిస్తుంది మీనాక్షి. ఎడమ చేత్తో కుండ లోపల ఆమె ఒక గుండ్రటి రాయిని తిప్పుతోంది. "కుండ గబుక్కున ముక్కలు కాకుండా చూసేందుకు, గోడలు నున్నగా వచ్చేలా చూసేందుకు అలా రాయితో నొక్కాలి." నలభై ఏళ్ళ నుంచి మట్టి పిసికీ పిసికీ ఎప్పుడూ చేతులు నెప్పిగానే ఉంటాయి అంటుంది మీనాక్షి. అలిసిపోయిన భుజాల నుంచి వేళ్ళ కొసల వరకు నెప్పి కత్తిలా పొడుస్తుంది. ఈ విషయం చెప్తూనే ఆమె మళ్ళీ తన కట్టె, రాయి తీసుకుని పని ప్రారంభిస్తుంది. మళ్ళీ కుండకి దెబ్బలు.

PHOTO • Aparna Karthikeyan

ఘటాన్ని చరచి రూపు దిద్దుతున్న మీనాక్షి (ఎడమ); కుండ గోడలు నున్నగా చేసేందుకు  ఉపయోగించే గుండ్రటి రాయి.  (కుడి)

ఆ ఊరిలో వాళ్ళు 'అవార్డు వచ్చిన కుమ్మరి' అని పిలిచే మీనాక్షిని కలుసుకునేందుకు మేము మనమదురైకి వచ్చాం. అవార్డు అంటే అలా ఇలా కాదు. ప్రతిష్టాత్మకమైన సంగీత నాటక అకాడెమి ఇచ్చిన పురస్కారం అది. రాష్ట్రపతి చేతుల మీదుగా మీనాక్షి అవార్డు అందుకుంటున్న ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ గోడకి తగిలించి ఉంది. డ్రాయింగ్ రూం లో గోడపైన ఆ పక్కనే దండ వేసిన ఆమె భర్త ఫోటో. మొత్తం కుటుంబం ఢిల్లీ వెళ్లి వచ్చిన ఆ సందర్భాన్ని  రమేష్ గుర్తు చేసుకుంటాడు. "మా అమ్మ విమానం ఎక్కడం ఆడ మొదటిసారి. ఉత్సాహం, భయం రెండూ పడింది అమ్మ." "2014 ఏప్రిల్ 11 నాడు మమ్మల్ని ఎయిర్ కండిషన్ బస్ లో రాష్ట్రపతి భవన్ కి తీసుకునివెళ్ళారు. ఆ సాయంత్రం అమ్మ అవార్డు తీసుకుంది. సంగీత వాయిద్యాలు తయారు చేసే ఒక మహిళా అవార్డు తీసుకోవడం దేశంలో అదే మొదటి సారి ఏమో!"

PHOTO • Aparna Karthikeyan

మీనాక్షి కి వచ్చిన అకాడెమీ అవార్డు (కుడి ) రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకుంటున్న ఫోటో (ఎడమ)

రమేష్ కూడా మంచి నైపుణ్యం కలవాడే. కానీ అమ్మ చేసే పని అంటే అతనికి ఎంతో ఆరాధన. "మంచి నాణ్యత కల ఘటాలు తయారు చేసే సంపూర్ణ నైపుణ్యం కల ఏకైక ఘటం తయారీ కళాకారిణి," అని అభివర్ణిస్తూ అకాడమి పుస్తకంలో రాసి ఉన్న వాక్యం మాకు చూపించాడు. "మీనాక్షి చేసిన వందలాది ఘటాలు మహా కళాకారులతో ప్రపంచమంతా ప్రయాణించాయి," అని రాసి ఉంది ఆ పుస్తకంలో.

ఘటం చేసేందుకు ఉపయోగించే మట్టి కూడా చాలా దూరమే ప్రయాణించి వస్తుంది. "అయిదు ఆరు చెరువుల నుంచి ఈ మట్టిని సేకరిస్తాం," రమేష్ చెప్తాడు. ఒక రోజంతా ఎండపెట్టిన తర్వాత ఆ బంక మట్టిలో వైగై నదీగర్భం నుంచి తీసిన సన్నని ఇసుక కలుపుతారు. "ఆ తర్వాత అందులో గ్రాఫైట్ కలిపి, ఆరు గంటల పాటు తొక్కి, రెండు రోజులు అలాగే ఉంచేస్తాం. మన్ను బలంగా అయిన తర్వాత, కుండ చేస్తాం."

రమేష్ చెప్తూ ఉంటే వినడానికి సులువే అనిపిస్తుంది. అతను కరెంట్ చక్రం ముందు కూర్చుని, ఒక పెద్ద మట్టి ముద్దను చక్రం మధ్యలో పెడతాడు. చక్రం తిరుగుతూ ఉంటె, అతను చటుక్కున మట్టి ముద్ద ఎత్తి తన చేతులతో కుండకి రూపం ఇవ్వడం ప్రారంభిస్తాడు.

పూర్తి కాగానే, కుండని రెండు వైపులా నుంచి తడుతూ దానికి రూపం ఇస్తాడు. (మీనాక్షి తన ఒళ్లో పెట్టుకుని కొడుతున్న ఒక్కో కుండ బరువు ఆ సమయంలో 16 కిలోలు ఉంటుంది). ఆ తర్వాత రెండు వారాల పాటు ఘటాన్ని నీడలో ఆరబెట్టి, తర్వాత నాలుగు గంటల పాటు ఎండలో వేడి చేస్తారు. అప్పుడింక, వాటికి ఎరుపు పసుపు పాలిష్ వేసి, 12 గంటల పాటు కొలిమిలో కాలుస్తారు. కొలిమిలో కాలేటప్పటికి కుండల బరువు సగానికి సగం తగ్గిపోతుంది. చివరకు ఫలస్వరూపం అత్యద్భుతమైన సంగీతం వినిపించే ఎనిమిది కిలోల మట్టి అన్నమాట.

PHOTO • Aparna Karthikeyan

కరెంట్ చక్రం తిప్పుతున్న రమేష్ (ఎడమ ); మట్టిని ఎత్తి కుండగా మలచడం (కుడి )

ఘటం తయారీలో కాలక్రమేణా ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు విద్వాంసులకు కావలసినట్లుగా ఘటాలను చిన్నగా, బరువు తక్కువగా, నాజూకుగా చేస్తున్నారు. "అవి మోసుకుని తిరగడం కూడా తేలిక," రమేష్ వివరిస్తాడు. అయినప్పటికీ మనమదురై ఘటాలు బరువనే చెప్పాలి. వంటకి ఉపయోగించే కుండల కంటే మూడు రెట్లు బరువు, రెండు రెట్లు మందంగా ఉంటాయి అవి. చెన్నైలో బెంగళూరులో చేసే ఘటాలు పల్చగా, తేలికగా ఉంటాయి.

ఘటం తయారీలో నైపుణ్యంతో పాటు, మనమదురైలో దొరికే బంక మన్ను సంగతి కూడా చెప్పుకోవాలి. మంచి నాణ్యత కల ఈ మట్టి ఇప్పుడు ఎక్కువగా ఇటుకల తయారీకి పోవడంతో, కుమ్మరుల జీవనోపాధి దెబ్బ తింటోంది. అయినప్పటికీ, తన కుటుంబంలో ఐదో తరమైన తన కుమార్తెలు, మేనల్లుడు, మేనకోడలికి ఈ కళ నేర్పించాలని రమేష్ ఎంతో ఉత్సుకతతో ఉంటాడు. డబ్బు కోసం కాదు, ఒక్కో ఘటానికి లభించేది కేవలం 600 రూపాయలు మాత్రమే. అదే ఒక లగ్జరీ బ్రాండ్ బోన్ చైనా గిన్నెకి వెల చూస్తే, వేల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది.

PHOTO • Aparna Karthikeyan

చక్రం నుంచి పచ్చి కుండను తీసి లోపలకు తీసుకుని వెడుతున్న రమేష్.

అయినప్పటికీ, తమ 160 సంవత్సరాల వారసత్వాన్ని కాపాడుకోవాలన్న తపనతో ఆ కుటుంబం ఘటం తయారీ కొనసాగిస్తోంది. “నాకు పదేళ్ళ వయసు ఉన్నప్పుడు ఒక అమెరికన్ జర్నలిస్ట్ మా ఇంటికి వచ్చారు. మా సంపాదన ఎంత తక్కువగా ఉందో చూసి ఆశ్చర్యపోయిన ఆమె, నన్నూ, నా చెల్లెళ్ళనీ ఊటీలో కాన్వెంట్ స్కూల్ కి పంపిస్తానని అడిగారు. మా నాన్న వద్దన్నారు. మేము ఘటాలు చేయడం నేర్చుకోవాలని ఆయన ఉద్దేశ్యం." రమేష్ కి చిన్నప్పుడు కుండలు చేయడం నేర్పించింది తన 90 సంవత్సరాల తాతగారు. "తుది శ్వాస విడిచే రెండు రోజుల ముందు వరకు మా తాతగారు పని చేస్తూనే ఉన్నారు," రమేష్ గుర్తుచేసుకున్నాడు. "ఎవరూ ఎప్పుడూ తనకు ఫోటో జాగ్రత్త పడ్డారు కాబట్టి మా మామగారు అన్ని రోజులు బతికారు," అంటుంది మీనాక్షి. అది విన్న వెంటనే నేను తత్తరపడి నా కెమెరా లోపల పెట్టేసుకున్నాను.

తన ఆదాయం ఎంతో తక్కువ అయినా, తన పని సంగీతానికి సేవ అని భావిస్తుంది మీనాక్షి. ముందు నుంచి పక్క వాయిద్యం అయిన ఘటం ఇప్పుడు సోలో వాయిద్యంగా కూడా హోదా పొందింది. తాను చేసిన ఘటం వాయించిన ఒకటి రెండు కచ్చేరీలకు మీనాక్షి హాజరైంది. ఈ వివరాలన్నీ కూడా రమేషే చెప్తాడు. మీనాక్షి పెద్దగా కబుర్లు చెప్పదు. అకాడెమి అవార్డు పొందిన తర్వాత ఆమెతో చేసిన ఇంటర్వ్యూల్లో కూడా ఆమె తన గురించి తానూ మాట్లాడడానికి ఇష్టపడడం లేదని రాశారు. “క్రితం సంవత్సరం ఆకాశవాణిలో ఆమె తొలిసారిగా సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో అయితే అమ్మ మా నాన్నకి ఇష్టమైన పులుసు గురించి కూడా మాట్లాడింది," తలచుకుని నవ్వుతాడు రమేష్.

తను స్వయంగా నాకు చెప్పిన అతి కొద్ది విషయాల్లో ఎక్కువ భాగం తన పని గురించే. ఘటం ఒక్కటే కాదు వారు చేసేది. ఆదాయానికి అది ప్రధాన మార్గం కాదు. సిద్ధ ఔషధాలు చేసేందుకు ఉపయోగించే పాత్రలతో సహా ఆ కుటుంబం అనేక రకాల మట్టి పాత్రలు తయారు చేస్తుంది. ఒక ఏడాది కాలంలో, మీనాక్షి, రమేష్, అతని భార్య మోహన, చెల్లెలు పరమేశ్వరి, కొంత మంది సహాయకులతో కలిసి సుమారు 400 ఘటాలు తయారు చేస్తారు. వీటిల్లో సగమే అమ్ముడుపోతాయి, మిగిలినవి స్వరం, శృతి విషయంలో పరీక్ష పెడితే పనికి రాకుండా పోతాయి. కొన్ని సార్లు చాలా అందంగా కనిపించే ఘటం కూడా సంగీతం విషయంలో మాత్రం ఎందుకూ పనికి రాదు.

"ఈ వ్యాపారంలో ఆర్ధిక సహాయం అందదు. మా వృత్తికి ప్రభుత్వం ప్రోత్సాహం లేదు. ఘటం విద్వాంసుల మాదిరిగా కాక మాకు ఎవరూ మెచ్చి అవార్డులు ఇవ్వరు," రమేష్ విచారపడతాడు. అయితే, ఎన్ని ఇబ్బందులు ఉన్నా అనేక మందికి తాము జీవనోపాధి కల్పిస్తున్నామని అతనికి గర్వంగా ఉంటుంది.

మేము అక్కడకి వెళ్ళిన రోజు సన్నగా వర్షం కురుస్తోంది. పని వాళ్ళందరూ సగం ఎండిన కుండలను హడావిడిగా లోపలకి తీసుకుని వెడుతున్నారు. అన్ని గదుల్లో పైకప్పు వరకు కుండలు పేర్చి ఉన్నాయి. మేఘావృతమైన ఆకాశం మధ్యాహ్నం అంతా కురిసి తీరతానని ఉరుములతో సూచన చేస్తోంది. అసలు ఈ వర్షాకాలం మహా విసుగు అంటారు పనివాళ్ళు. పని ఆగిపోవడంతో రమేష్ పరధ్యానంగా ఘటం వాయిస్తున్నాడు. మట్టి పూత పోసి ఉన్న అతని చేతులు కాళ్ళు చందనం రంగులో మెరుస్తున్నాయి. కుండ అంచు వద్ద వేళ్ళతో తట్టి, ఘటంలో నుంచి ఖంగుమన్న స్వరం రప్పిస్తాడు రమేష్. "నేను ఘటం వాయించడం నేర్చుకోలేదు," అంటాడు కానీ అతనికి మంచి లయ జ్ఞానం ఉన్న సంగతి తెలుస్తూనే ఉంది.

చాలా లయ వాయిద్యాలో జంతు చర్మం వాడతారు. "ఘటాలు మాత్రమే పంచభూతాల నుంచి తయారు అవుతాయి. భూమి నుంచి మట్టి, సూర్యుడి నుంచి ఎండా, ఆరబెట్టేందుకు గాలి. నీరు మట్టికి రూపం ఇస్తుంది, అగ్ని కొలిమిలో కాల్చి నునుపు చేస్తుంది." ఈ వర్ణనలో రమేష్ ఘటం తయారు చేసేందుకు మనుషులు పడుతున్న శ్రమ గురించి మాత్రం ప్రస్తావించలేదు. అవసరం లేదు కూడా. ఎందుకంటే, మీనాక్షి నున్నని, పటిష్టమైన ఘటం రూపుదిద్దేందుకు కుండకి కొడుతున్న దెబ్బలు మేము కూర్చున్న చోటికి లయబద్ధంగా వినిపిస్తూ, ఘటం తయారీలో మనిషి శ్రమ, కృషి, నైపుణ్యం గురించి కితాబు ఇస్తూనే ఉన్నాయి.

PHOTO • Aparna Karthikeyan

ఇంట్లో పైకప్పు వరకు మట్టి వస్తువులు పేర్చి ఉన్నాయి. ఘటానికి మాత్రమే కుర్చీ పైన స్థానం.

అనువాదం: ఉషా తురగా-రేవెల్లి

ఉషా తురగా-రేవెల్లి జర్నలిస్ట్, బ్రాడ్కాస్టర్, సామాజిక కార్యకర్త, పరీ వాలంటీర్...మనసుకి నచ్చిన పనిలో దూకేసే ఔత్సాహికురాలు.

అపర్ణా కార్తికేయన్ అమ్మగా పూర్తిస్థాయిలోనూ, రచయిత్రిగా కొంత సమయంలోనూ, 'పరీ' వాలంటీర్ గా మిగిలిన సమయాల్లోనూ పని చేస్తుంటారు. అపర్ణ కాంటాక్ట్: @AparnaKarthi .

Aparna Karthikeyan

Aparna Karthikeyan is an independent journalist, author and Senior Fellow, PARI. Her non-fiction book 'Nine Rupees an Hour' documents the disappearing livelihoods of Tamil Nadu. She has written five books for children. Aparna lives in Chennai with her family and dogs.

Other stories by Aparna Karthikeyan
Translator : UshaTuraga-Revelli

Usha Turaga-Revelli is a journalist, broadcaster, activist, PARI volunteer and a dabbler in anything that appeals to her heart.

Other stories by UshaTuraga-Revelli