హీరాబాయి ఫకీరా రాఠోడ్ కు అసలు ట్రాక్టర్ కొనే ఉద్దేశమే లేదు. కానీ, 2010లో బ్యాంకులు పెద్ద ఎత్తున ట్రాక్టర్ రుణ మేలాను చేపట్టినప్పుడు, ఓ విక్రయదారు ఆమె బుర్రలో అలాంటి ఉద్దేశాన్ని నాటాడు. ‘ట్రాక్టర్ రుణం తేలిగ్గా లభిస్తుందనీ, తర్వాత దాన్ని తీర్చివేయడమూ చాలా సులువని ఆ విక్రయదారు నాకు నూరిపోశాడు ’ అని హీరాబాయి గుర్తుచేసుకున్నారు. ఔరంగాబాద్ జిల్లా కన్నడ్ తహశీలులో శిథిలావస్థలో ఉన్న ఒక ఇంట్లో నివసిస్తున్న ఆమె ఓ బంజారా ఆదివాసీ. ఆమె రుణ దరఖాస్తును స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖ చకచకా పరిశీలించి ఆమోదముద్ర వేసేసింది. హీరాబాయి భర్త పదవీవిరమణ చేసిన అటవీ గార్డు. వారిది పెద్ద కుటుంబం. ఇదే తహశీలులో వారికి మూడున్నర ఎకరాల భూమి ఉంది. ‘రుణం తీసుకుని ట్రాక్టర్ కొంటే సొంత పొలం దున్నుకోవడంతోపాటు, ఇతరుల పొలాలూ దున్ని కొంత డబ్బు ఆర్జించవచ్చునని అనుకున్నాం’ అని ఆమె చెప్పారు. రూ. 6,35,000 ధర పలికే ట్రాక్టర్ కొనుగోలుకు రూ. 5,75,000 బ్యాంకు రుణం పొందారామె. ఈ రుణాన్ని 15.9 శాతం వడ్డీపై ఏడు సంవత్సరాలలో తీర్చివేయాలి. ఇంత అప్పు చేసి ట్రాక్టర్ కొనడం ‘జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు’ అని బాధగా నిట్టూర్చారు హీరాబాయి. ట్రాక్టర్ రుణ ఖాతా పత్రాలను మాకు చూపారావిడ. 2016 మార్చి వరకు బాకీ కింద రూ. 7.5 లక్షలకు పైగా చెల్లించి దివాలా తీశారు. మరి రూ. 1.25 లక్షలు చెల్లిస్తే ఒకే దఫాలో రుణ పరిష్కారం (ఓటీఎస్) లభిస్తుందని బ్యాంకువారు ప్రతిపాదించారు.  హీరాబాయి ఈ డబ్బును బంధువుల నుంచి అప్పుగా తీసుకుని బ్యాంకుకు చెల్లవేశారు. ‘ బ్యాంకు రుణ భారాన్ని నా పిల్లలపై మోపకూడదని భావించాను ’అని ఆమె వివరించారు.


ఏమాత్రం ఆర్థిక స్తోమత లేని ఈ బంజారా మహిళ అష్టకష్టాలు పడి మొత్తం 9 లక్షల రూపాయలను బ్యాంకుకు కట్టారు. ఇంతాచేసి ఆమె తీసుకున్న రుణం రూ. 5.75 లక్షలు మాత్రమే. మహారాష్ట్రలో క్షామపీడిత మరాఠ్వాడా ప్రాంతంలో వ్యవసాయం బొత్తిగా పడకేయడంతో, హీరాబాయి కొన్న ట్రాక్టర్ కు ఇతరుల పొలాల్లో పని దొరకనే లేదు. ఒక్క ఔరంగాబాద్ లోనే కాదు దేశమంతటా హీరాబాయిలాంటి వారెందరో ఉన్నారు. హీరాబాయి అయితే ఎలాగోలా అప్పు తీర్చగలిగారు కానీ, మిగిలినవారిలో అత్యధికులకు ఆ వెసులుబాటు లేకపోయింది. రైతులు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవడం మహారాష్ట్రలో చాలా చాలా ఎక్కువ. అలాంటి రాష్ట్రంలో ఒక్క మరాఠ్వాడా ప్రాంతంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్.బి.హెచ్) 2005-06 నుంచి ఇంతవరకు వెయ్యి ట్రాక్టర్ కొనుగోలు రుణాలిచ్చింది.


‘బ్యాంకులు ఎడాపెడా ట్రాక్టర్ రుణాలు ఇచ్చేశాయి. ప్రాధాన్య రంగ కోటా కింద అవి రుణాలివ్వాల్సి ఉంది. ట్రాక్టర్ రుణాలు వ్యవసాయ రుణాలకిందకు వస్తాయి కాబట్టి బ్యాంకులు జోరుపెంచాయి. తమ కోటాను పూర్తి చేయడం కోసం ఆర్థిక స్తోమత లేనివారికి సైతం బాగా ఎక్కువ వడ్డీకి ఈ రుణాలను అంటగట్టాయి. హరిబాయి ఎలాగోలా ఒకే దఫాలో రుణ పరిష్కారం చేసుకోగలిగింది కానీ, అలా రుణాన్ని తీర్చుకోలేక కిస్తీల మీద కిస్తీలు కడుతున్నా రుణ భారం ఎంతకూ తగ్గని అభాగ్యులు వేలల్లో ఉంటారు. అంతేకాదు, అసలు నెలసరి కిస్తీలే కట్టలేనివారు మరెందరో ఉన్నారు’ అని అఖిల భారత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి దేవీదాస్ తుల్జాపూర్కర్ వెల్లడించారు. ఒక్క కన్నడ్ తహశీలులోని ఎస్.బి.హెచ్ శాఖ నుంచే రుణం తీర్చలేకపోతున్న 45 మంది ఖాతాలను సేకరించాం. వీరంతా బ్యాంకుకు తీర్చాల్సిన రుణం రూ. 2.7 కోట్లు. ఇవి కేవలం ఒక్క రాష్ట్రంలోని ఒక చిన్న పట్టణంలో ఒకే ఒక్క బ్యాంకు శాఖ నుంచి సేకరించిన వివరాలు. దేశమంతటా వివిధ బ్యాంకుల శాఖల్లో ఇలాంటి రుణ ఖాతాలు వేలల్లో ఉంటాయి.


02-IMG_1208-PS-The Benz and the Banjara.jpg

నగరాల్లో వాహన రుణాల జోరు ఎంతగా ఉందో ముంబయ్ లో ఈ బ్యాంకు కౌంటర్ ను చూస్తే అర్థమవుతుంది. ఇందులో ఏదైనా గూట్లో ఒక ట్రాక్టర్ బొమ్మ కూడా ఉండేదా?


హరిబాయి 15.9 శాతం వడ్డీకి ట్రాక్టర్ రుణం పొందిన సమయంలోనే, ఆమె ఊరికి కేవలం 65 కిలోమీటర్ల దూరంలోని ఔరంగాబాద్ నగరంలో మరో పెద్ద రుణ మేలా జరిగింది. ఆ నగరంలోని పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు, వైద్యులు, న్యాయవాదులు, ఇతర వృత్తినిపుణులతో ఏర్పడిన ‘ఔరంగాబాద్ గ్రూపు’ 2010 అక్టోబరులో ఒకే ఒక్క రోజున 150 అత్యంత ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కార్లు కొన్నది. (ఈ గ్రూపు సభ్యుడొకరు తర్వాత ఔరంగాబాద్ తూర్పు నియోజక వర్గం నుంచి విధాన సభకు ఎన్నికయ్యారు). ఔరంగాబాద్ ఎంతో ఎదిగిందనడానికి బెంజ్ కార్ల కొనుగోలే నిదర్శనమనీ, దీంతో నగరం అంతర్జాతీయ పెట్టుబడుల పటంలో ప్రముఖ స్థానం సంపాదించిందనీ కొందరు గ్రూపు సభ్యులు అప్పట్లో వ్యాఖ్యానించారు. వారు ఈ విజయం సాధించడానికి బ్యాంకులు దండిగా సాయం చేశాయి. ఆ రోజు విక్రయమైన బెంజ్ కార్ల ధరలు రూ. 30-70 లక్షల వరకు ఉన్నాయి. కేవలం 24 గంటల్లో 150 లగ్జరీ కార్లు విక్రయమవుతున్నాయి కాబట్టి, బెంజ్ కంపెనీ ధరలను బాగా తగ్గించింది. అప్పటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడి ప్రత్యేక ఆదేశాన్ని పురస్కరించుకుని ఔరంగాబాద్ ఎస్.బి.హెచ్ బాగా తక్కువ వడ్డీకి వాహన రుణాలిచ్చింది. మొత్తం బెంజ్ కార్ల విక్రయ ధర 65 కోట్ల రూపాయలు కాగా, అందులో మూడింట రెండు వంతుల్ని కేవలం 7 శాతం వడ్డీకే రుణంగా ఇచ్చింది.


ఇలా ఒకే దఫాలో 150 కార్లు అమ్మిన ఆనందంలో మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విల్ ఫ్రీడ్ ఔల్బర్, భారతదేశంలోని రెండవ, మూడవ అంచె పట్టణాలకూ అపారమైన ఆర్థిక సత్తా సమకూరడం ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు. ‘నేడు ఈ సత్తా అమోఘంగా, సాహసోపోతంగా ఒకే దెబ్బకు 150 మెర్సిడెస్ బెంజ్ కార్ల కొనుగోలులో వ్యక్తమైంది’ అని ఆయన సంబరపడ్డారు.


ఔరంగాబాద్ జిల్లాలో ఇతర చోట్ల హీరాబాయి వంటి ట్రాక్టర్ కొనుగోలుదారులకు మరో రకమైన దెబ్బతగిలింది. బెంజ్, ట్రాక్టర్ గ్రూపులు రెండూ పేరుకు వాహన రుణాలే తీసుకున్నాయి. అదీ ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచే. కానీ, నగర సంపన్నులకన్నా హీరాబాయి రెండింతలు ఎక్కువ వడ్డీకి రుణం తీసుకుంది. బహుశా ఆమె ఔరంగాబాద్ ను అంతర్జాతీయ పెట్టుబడుల పటంలోకి ఎక్కించలేకపోవడం వల్లనే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వచ్చిందా! 12.5 నుంచి 15.9 శాతం వడ్డీ రేటుకు ట్రాక్టర్ రుణాలు తీసుకున్నవారిలో ఎక్కువమంది ఆదివాసీలు, దళితులే. వీరెవరూ బెంజ్ కార్లు కొనుగోలు చేయలేరు, చేయలేదు కూడా.


తేల్వాడీ తండాకు చెందిన వసంత్ దళపత్ రాఠోడ్ రూ. 1.75 లక్షల ఓటిఎస్ చార్జితో సహా మొత్తం రూ. 7.53 లక్షలను ఎస్.బి.హెచ్, కన్నడ్ తహశీలు శాఖకు చెల్లించారు. అంబా తండాకు చెందిన మరో బంజారా అమర్ సింగ్ ముఖారాం రాఠోడ్  అదే బ్యాంకుకు రూ. 11.14 లక్షలు బాకీపడ్డాడు. ఇంతా చేసి అతడు తీసుకున్న రుణం అందులో సగమే. అయినా ఇంతవరకు ఒక్క కిస్తీ కూడా చెల్లించలేకపోయాడు, బహుశా ఎప్పటికీ చెల్లించలేడేమో! అతడి కోసం వెతుకుతూ వెళ్లిన మా బృందానికి, అసలు అమర్ సింగ్ అనే వ్యక్తి ఎవరూ ఇక్కడ లేరని ఇరుగుపొరుగులు చెప్పుకొచ్చారు. అతడి కోసం బ్యాంకువాళ్లు వస్తున్నారనే వార్త తండాలో ముందుగానే వ్యాపించడం దీనికి కారణం. అమర్ సింగ్ ఇంటి వద్ద మాకు ట్రాక్టర్ కానీ, మరేదైనా విలువైన వస్తువు కానీ కనబడనే లేదు. ఒక పేదవాని పేరు మీద స్తోమత ఉన్న వ్యక్తి రుణం తీసుకోవడం తరచుగానే జరుగుతుంది. ఇదీ అలాంటే వ్యవహారమే కావచ్చు. కన్నడ్ లో 45 కేసులతోపాటు ఇతర తహశీళ్లలో, బ్యాంకు శాఖల పరిధిలోకి వచ్చే ట్రాక్టర్ రుణ బకాయిదారుల వివరాలనూ మేము సేకరించాం.


‘బ్యాంకులు ఈ రుణాలలో ఏ ఒక్కదాన్నీ నిరర్థక ఆస్తిగా ప్రకటించలేదు. మొత్తం ట్రాక్టర్ రుణాలు కోట్లలో ఉంటాయి. వీటిని బ్యాంకులు కాగితాల మీద రాబడి వస్తున్న ఖాతాలుగా చూపుతాయి. నిజానికి అసలు రుణంకన్నా రావలసిన బకాయిలు రెండింతలు ఎక్కువ ఉంటాయి. వీటిలో ఒక్క పైసా కూడా చెల్లించని కేసులు ఎన్నెన్నో. రుణ చెల్లింపు గడువు ఎన్నడో పూర్తయిపోయినా, ఖాతాను మామూలు ఖాతాగానే చూపుతుంటారు. కానీ, నిజం ఎప్పుడో ఒకప్పుడు బయటపడక తప్పదు’ అని తుల్జాపూర్కర్ చెప్పారు. అదీకాకుండా పేదలను ట్రాక్టర్ డీలర్లు, దళారులు మోసం చేస్తుంటారు. ‘వీరు ట్రాక్టర్ తోపాటు ట్రాలీనీ, ఇతర అనుబంధ పరికరాలను కూడా కొనడానికి బ్యాంకు నుంచి రుణం మంజూరు చేయిస్తారు. రైతుకు ట్రాక్టర్ మాత్రం అప్పజెప్పి మిగతా మొత్తాన్ని తమ జేబులో వేసుకుంటారు ’ అని కూడా ఆయన వివరించారు.


బెంజ్ కొనుగోలుదార్లలో రుణం ఎగ్గొట్టిన శాల్తీలు లేకపోలేదు. ‘చాలా కార్లను రెండు సార్లు, మూడుసార్లు, అంతకన్నా ఎక్కువసార్లే వేరేవాళ్లకు అమ్మారు’ అని ఔరంగాబాద్ కు చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త చెప్పారు. కొంతమంది అయితే ముదరానూ, తక్కువ వడ్డీ రేట్లనూ సొమ్ము చేసుకుని, వెంటనే కారును వేరేవాళ్లకు లాభానికి అమ్మేశారని మరో ప్రముఖుడు వెల్లడించారు.


2004-14 మధ్యకాలంలో భారత్ లో ట్రాక్టర్ అమ్మకాలు మూడింతలు పెరిగాయి. 2013లో భారత్ 6,19,000 ట్రాక్టర్లను ఉత్పత్తి చేసింది. ఇది ప్రపంచ ఉత్పత్తిలో మూడోవంతు. ఇది గ్రామీణ ప్రగతికి నిదర్శనమనీ, గ్రామీణ భారత విజయాలకు చిహ్నమనీ అనేకమంది కీర్తించారు. గ్రామాల్లో కొన్ని వర్గాల ఆదాయాలు పెరిగి, ట్రాక్టర్ అమ్మకాలు ఊపందుకున్న మాట నిజమే. కానీ, దానికన్నా బ్యాంకులు ఎడాపెడా రుణాలివ్వడమే  అమ్మకాల విజృంభణకు ప్రధాన కారణం. సాంఘిక, ఆర్థిక, కుల గణన ప్రకారం కేవలం 8 శాతం గ్రామీణ కుటుంబాల్లోనే నెలకు రూ. 10,000కు పైగా ఆదాయం ఆర్జించే సభ్యులున్నారు. (ట్రాక్టర్ కొన్న కుటుంబాల సంఖ్య ఎనిమిది శాతంకన్నా బాగా తక్కువ). వాస్తవాలు ఇలా ఉంటే, ట్రాక్టర్ అమ్మకాలు గ్రామీణ భారతం పురోగమిస్తోందనడానికి సూచి అని కొందరు ఆర్థికవేత్తలు, పాత్రికేయులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఔరంగాబాద్ డీలర్లు ట్రాక్టర్ అమ్మకాలు సగానికి సగం తగ్గిపోయాయంటున్నారు. ఈ లెక్కన గ్రామీణ ప్రగతి పడకేసినట్లే కదా!


మెర్సిడెస్ బెంజ్ విలాస వస్తువైతే ట్రాక్టర్ ఉత్పాదక వస్తువు. కానీ, 2004-14 మధ్య కాలంలో అప్పులిచ్చి పెంచిన ట్రాక్టర్ విక్రయాలను శీఘ్ర గ్రామీణ ప్రగతికి నిదర్శనంగా చూపడం హాస్యాస్పదం. అలాగే 150 బెంజ్ కార్లను ఒకే రోజు అమ్మి ఔరంగాబాద్ అంతర్జాతీయ పెట్టుబడుల పటంలోకి ఎక్కిందనడమూ హాస్యాస్పదమే. మరాఠ్వాడా ప్రాంతంలో తలసరి ఆదాయం రూ. 64,330 మాత్రమే. ఇది మహారాష్ట్రలోనే అతి తక్కువ. ఖచ్చితంగా చెప్పాలంటే  మరాఠ్వాడా తలసరి ఆదాయం మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకన్నా 40 శాతం, ముంబయ్ కన్నా 70 శాతం తక్కువ.


ఇది ఇలా ఉండగా, మహారాష్ట్రలో సరికొత్త దివాలా సంక్షోభం ముంచుకొస్తోంది. ఈసారి ముప్పు మట్టి తవ్వకం యంత్రాల (ఎక్స్ కవేటర్ల) రూపంలో పొంచివుంది. మహారాష్ట్రతో పాటు అనేక ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మానవ కూలీలకన్నా ఎక్స్ కవేటర్ యంత్రాల మీద ఆధారపడటం ఎక్కువైపోయింది. ఈ యంత్రాల కొనుగోలుదారులలో అనేకమంది డబ్బు పోగొట్టుకొని దివాలా తీయబోతున్నారని స్వయాన కాంట్రాక్టర్, ఖుల్తాబాద్ పట్టణ మునిసిపల్ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు హాజీ అక్బర్ బేగ్ చెప్పారు. ‘ కేవలం 19,000 జనాభా గల మా చిన్న పట్టణంలోనే ఏకంగా 30 జేసీబీలు (జె.సి. బామ్ ఫర్డ్ తవ్వకం యంత్రాలు) ఉన్నాయి. రాష్ట్రమంతటా మరెన్ని జేసీబీలున్నాయో ఎవరికి ఎరుక?’ అన్నారాయన. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం జలయుక్త్ శివర్ అభియాన్ తదితర పథకాల్లో జేసీబీలను ఎక్కువగా వాడుతున్నందువల్ల, వీటికి బాగా గిరాకీ ఉంటుందనుకొని చాలామంది జేసీబీలను కొనుగోలు చేశారు. ఒక్కో యంత్రం ధర రూ. 29 లక్షలు. వీటిని కొనడానికి ప్రైవేటు బ్యాంకుల నుంచి బ్యాంకేతర ఆర్థిక సంస్థల (ఎన్.బి.ఎఫ్.సి) నుంచీ భారీగా రుణాలు తీసుకున్నవారెందరో. ‘ మొదట్లోనే జెసీబీలను కొన్నవారిలో నేనూ ఉన్నాను. కానీ, నేను బ్యాంకు నుంచి రుణం తీసుకోలేదు. పాత యంత్రాలను అమ్మి, కుటుంబ సభ్యుల నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకొని జేసీబీని కొనుగోలు చేశాను’ అని బేగ్ వివరించారు.


‘జేసీబీల నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వీటిని తట్టుకొంటూ నెలనెలా బ్యాంకు రుణవాయిదా చెల్లిస్తూ బండి నడపాలంటే నెలకు కనీసం లక్షరూపాయల ఆదాయం రావాలి. ఎండా కాలంలో ఆ మేరకు పనులు లభించినా, వర్షాకాలంలో ఆ పరిస్థితి ఉండదు. పట్టణంలో ఇప్పుడున్న 30 జేసీబీలకు కాదు కదా, కనీసం 3 జేసీబీలకు సరిపడా పనులైనా లభించవు. అప్పుడు పరిస్థితి ఏమిటి? ఈ రంగంలో అనుభవం లేనివారు కూడా భారీ పోక్లైన్ హైడ్రాలిక్ ఎక్స్ కవేటర్లను కొనుగోలు చేశారు. వీటి ధర జేసీబీలకన్నా రెట్టింపు ఉంటుంది. వీటిని కొనడానికి మళ్లీ బ్యాంకుల మీద ఆధారపడాల్సిందే. ఇంతటి భారీ రుణాలు తీర్చలేక చాలామంది మునిగిపోతున్నారు. ఇక్కడే కాదు, ఇతర చోట్లా ఇదే పరిస్థితి ఉందని అనుమానిస్తున్నా. బాగా పరిచయాలున్న కొద్దిమంది వ్యాపారులకే కాంట్రాక్టులు లభిస్తాయి. ప్రతి 100 మందిలో 10 మంది వ్యాపారంలో నిలబడతారేమో! మిగతావాళ్లు దివాలా తీస్తారు’ అని బేగ్ చెప్పుకొచ్చారు.



03-P1040127(Crop)-PS-The Benz and the Banjara.jpg

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో సంచార బంజారా తెగకు చెందిన హీరాబాయి


కన్నడ్ లో హీరాబాయి ఇంటికి వెళ్లిన మా బృందాన్ని చూసి బ్యాంకు అధికారులుగా పొరబడిందావిడ. ‘ఇప్పుడు నా  పరిస్థితి ఏమవుతుంది? ’ అని భయం భయంగా అడిగిందామె. రూ. 6.35 లక్షలు (బహుశా అంతకన్నా తక్కువ) విలువ చేసే ట్రాక్టర్ కొనడానికి రూ. 5.75 లక్షల బ్యాంకు రుణం తీసుకుని, ఇప్పటికే రూ. 9 లక్షలు చెల్లించిన హీరాబాయి, ‘నేను తీర్చాల్సిన బాకీ ఇంకా ఉందా? ’ అని ఆందోళనగా ప్రశ్నించారు. లేదు, నీవు చెల్లించాల్సినదానికన్నా చాలా ఎక్కువే చెల్లించావని ఆవిడకు చెప్పాం.


పి . సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ ది రూరల్ ఇండియా సంస్థాపక - సంపాదకుడు . ఎన్నో దశాబ్దాలపాటు గ్రామీణ విలేఖరిగా పనిచేసిన అనుభవంతో ఎవ్రీబడీ లవ్స్ గుడ్ డ్రౌట్ అనే గ్రంథం రాశారు . ఆయన్ను సంప్రదించదలచినవారు @PSainath_org కు రాయండి .



P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath