రాయపుర్ ఇటుక బట్టీల వద్ద అది మధ్యాహ్న భోజన సమయం. అక్కడి కూలీలు గబగబా ఒక ముద్ద తినటమో లేదా తాత్కాలికంగా కట్టుకున్న నివాసాలలో కాస్త విశ్రాంతి తీసుకోవటమో చేస్తున్నారు.

తన మట్టి గుడిసె నుంచి బయటకు వస్తూ, "మేం సత్నా నుంచి వచ్చాం," అని ఒక మహిళా కూలీ చెప్పింది. ఇక్కడ పనిచేస్తోన్న కూలీలలో ఎక్కువమంది పొరుగు రాష్ట్రం నుంచి వలసవచ్చినవారు; వాళ్ళు ప్రతి ఏటా నవంబర్-డిసెంబర్ నెలలలో కోతల కాలం ముగిశాక ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని అయిన ఇక్కడకు వచ్చి, ఆరు నెలల పాటు - మే లేదా జూన్ నెల వరకు - ఇక్కడ ఉంటారు. భారతదేశ ఇటుక బట్టీల పరిశ్రమలో 10-23 మిలియన్ల మంది కార్మికులు పనిచేస్తున్నారు (భారతదేశ ఇటుక బట్టీలలో బానిసత్వం, 2017 ).

ఈ ఏడాది, వాళ్ళు తిరిగి తమ ఇళ్ళకు చేరుకునే సమయానికి కేంద్రంలో ఒక కొత్త ప్రభుత్వం ఉంటుంది. కానీ తమ కొత్త నాయకులను ఎన్నుకునే ప్రక్రియలో ఈ వలస కూలీల పాత్ర ఉంటుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం.

"వోటు వేసే సమయానికి మాకు సమాచారం వస్తుంది," తన గుర్తింపును చెప్పడానికి ఇష్టపడని ఆ మహిళ PARIతో చెప్పింది.

ఆ సమాచారాన్ని బహుశా వాళ్ళ లేబర్ కంట్రాక్టర్, సంజయ్ ప్రజాపతి వారికి అందజేస్తుండవచ్చు. ఆ గుడిసెలకు కొంత దూరంలో నిల్చొని ఉన్న అతను మాతో ఇలా చెప్పాడు,"సత్నాలో పోలింగ్ గురించి మాకింకా సమాచారం లేదు. మాకు తెలిస్తే వాళ్ళకు చెప్తాం." సంజయ్‌తో సహా అక్కడ పనిచేసేవారిలో ఎక్కువమంది ప్రజాపతి సముదాయానికి (మధ్యప్రదేశ్‌లో ఇతర వెనుకబడిన వర్గంగా జాబితా అయివుంది) చెందినవారే.

PHOTO • Prajjwal Thakur
PHOTO • Prajjwal Thakur

ఎడమ: శీతాకాలంలో కోతల కాలం పూర్తికాగానే, మధ్యప్రదేశ్ నుంచి వలస కూలీలు ఇటుక బట్టీలలో పనిచేసేందుకు ఛత్తీస్‌గఢ్‌కు ప్రయాణం కడతారు. వారు ఇక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న నివాసాలలో వర్షాకాలం వచ్చేవరకు ఆరు మాసాల పాటు ఉంటారు. కుడి: మధ్యప్రదేశ్ నుండి వచ్చిన యువ కార్మికుడు రామ్‌జస్, అతని భార్య ప్రీతి. ఇక్కడి ఇటుక బట్టీలో వారిద్దరూ కలిసి పనిచేస్తారు

PHOTO • Prajjwal Thakur
PHOTO • Prajjwal Thakur

ఎడమ: కార్మికులు ఈ బట్టీలలో ఉదయం పూట, రాత్రివేళల్లో పనిచేస్తారు. మధ్యాహ్నం ఎండ ముదిరినప్పుడు విశ్రాంతి తీసుకుంటారు. కుడి: లేబర్ కంట్రాక్టర్ సంజయ్ ప్రజాపతి (గులాబీ రంగు చొక్కా)తో రామ్‌జస్

ఏమాత్రం కనికరం చూపని ఏప్రిల్ మాసపు ఎండలో, ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ వరకూ చేరుకునే సమయంలో, ఇటుకలను అచ్చుపోయటం, వాటిని కాల్చటం, వాటిని మోసుకుపోయి వాహనాలలో నింపటం వంటి శ్రమతో కూడిన పనులను ఈ కార్మికులు చేస్తుంటారు. ఇటుకలు తయారుచేసే కార్మికులు రోజుకు రూ. 400 వరకూ సంపాదిస్తారని దేశీయ మానవ హక్కుల కమిషన్ ( 2019 ) నివేదిక చెప్తోంది. ఒక జంట ఒక యూనిట్‌గా కలిసి పనిచేస్తే, వారికి రూ. 600-700 వరకూ చెల్లిస్తారని ఆ నివేదిక పేర్కొంది. ఒక యూనిట్‌గా పనిచేయటం ఇక్కడి కార్మికులలో చాలా సాధారణ విషయం.

ఉదాహరణకు రామ్‌జస్ తన భార్య ప్రీతితో కలిసి జంటగా పనిచేస్తాడు. ఒక చిన్న పాక కింద కూర్చొని ఉన్న 20 ఏళ్ళు దాటిన ఈ యువకుడు తన మొబైల్‌ని చూసుకుంటూ ఉన్నాడు; పోలింగ్ తేదీ ఎప్పుడో సరిగ్గా తెలియకపోవటంతో, మే నెలలో ఎప్పుడో జరుగుతుందని అన్నాడు.

"మేం వోటు వేయటానికి 1500 [రూపాయలు] ఖర్చుపెట్టి సత్నా వెళ్ళేవాళ్ళం. అది మన హక్కు." అందరు పనివాళ్ళూ అలాగే వెళ్తుంటారా అని మేం అడిగాం. రామ్‌జస్ జవాబివ్వబోతుండగా సంజయ్ మధ్యలో కల్పించుకొని, " సబ్ జాతే హైఁ [అందరూ వెళ్తారు]," అని జవాబిచ్చాడు.

సత్నాలో ఎన్నికలు ఏప్రిల్ 26న జరిగాయి, ఈ రిపోర్టర్ ఆ కార్మికులతో మాట్లాడింది ఏప్రిల్ 23న. ఆ సమయానికి వారెవరి దగ్గరా రైలు టిక్కెట్లు లేవు.

రామ్‌జస్ వలస కార్మికుల కుటుంబం నుంచి వచ్చాడు. అతని తండ్రి కూడా ఛత్తీస్‌గఢ్ ఇటుక బట్టీలలో పనిచేశారు. రామ్‌జస్ 10వ తరగతి చదువుతుండగా తండ్రిని కోల్పోయాడు. ముగ్గురు సోదరులు, ఒక సోదరి ఉన్న కుటుంబంలో అందరికంటే చిన్నవాడైన రామ్‌జస్, పాఠశాల విద్య పూర్తయిన తర్వాత పనిచేయటం ప్రారంభించాడు. అతని అన్నలు కూడా సత్నా జిల్లాలోనే కార్మికులుగా పనిచేస్తారు. గత ఐదేళ్ళుగా వలస కూలీగా పనిచేస్తోన్న రామ్‌జస్, పండుగల సమయాల్లోనూ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లోనూ ఇంటికి వెళ్ళివస్తుంటాడు. ఇక్కడ బట్టీలలో పని అయిపోయిన తర్వాత కూడా అతను ఏదో ఒక పని చేసుకుంటూ ఇక్కడే ఉంటాడు. జనాభా సమాచారం (2011) ప్రకారం, మధ్యప్రదేశ్‌కు చెందిన 24,15,635 మంది పని కోసం వలసపోతుంటారు.

PHOTO • Prajjwal Thakur
PHOTO • Prajjwal Thakur

ఎడమ: ఎత్తుగా పేర్చివున్న కాల్చిన ఇటుకలు. కుడి: వినియోగదారులకు సరఫరా చేసేందుకు ట్రక్కులలో ఇటుకలను తీసుకువెళ్తోన్న కూలీలు

PHOTO • Prajjwal Thakur

రామ్‌జస్ వోటు వేయాలనుకుంటున్నాడు, కానీ అతని నియోజకవర్గంలో పోలింగ్ ఎప్పుడు జరుగుతుందో అతనికి సరిగ్గా తెలియదు

అయితే తమ ప్రజాస్వామిక హక్కులను కోల్పోతున్నది ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులే కాదు, ఛత్తీస్‌గఢ్‌లోని ఇతర జిల్లాల నుంచి ఇక్కడకు పని కోసం వలసవచ్చినవారు కూడా.

రాయపుర్‌లో ప్రతిపక్షాల ఉనికి దాదాపు లేకుండానే ఎన్నికల ప్రచారం ముగిసింది. నగర శివార్లలో ఉన్న ఈ ఇటుక బట్టీల చుట్టుపక్కల ఎలాంటి పోస్టర్లు గానీ, బ్యానర్లు గానీ కనిపించడంలేదు. వోట్లు అడుగుతూ వచ్చే అభ్యర్థుల రాకను తెలియచేసే ఎలాంటి లౌడ్‌స్పీకర్ల శబ్దాలు కూడా లేవు.

ఛత్తీస్‌గఢ్‌లోని బలౌదాబాజార్ జిల్లాకు చెందిన ఒక మహిళ పని నుంచి కొంత విరామం తీసుకుంటూ చెట్టు కింద కూర్చొని కనిపించారు. ఆమె తన భర్తతోనూ నలుగురు పిల్లలతోనూ కలిసి ఇక్కడికి వచ్చారు. "నేను మూడు నాలుగు నెలల క్రితమే వోటు వేశాను," అన్నారామె, నవంబర్ 2023లో ఛత్తీస్‌గఢ్ శాసనసభకు జరిగిన ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ. అయితే వోటింగ్ జరిగే సమయానికి తాను తన గ్రామానికి వెళ్తానని ఆమె చెప్తున్నారు. శాసనసభ ఎన్నికల సమయంలో ఆమె ఊరి సర్పంచ్ కబురుచేశాడు. అప్పుడు ప్రయాణానికీ, తిండికీ 1500 రూపాయలు ఖర్చయ్యాయి.

"మమ్మల్ని పిల్చుకువెళ్ళే అతనే మా ఖర్చులను కూడా చెల్లిస్తాడు," అన్నారామె. రాయపుర్ నియోజకవర్గం కింద ఉన్న బలౌదాబాజార్ జిల్లాకు మే 7న పోలింగ్ జరుగుతుంది.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Purusottam Thakur

Purusottam Thakur is a 2015 PARI Fellow. He is a journalist and documentary filmmaker and is working with the Azim Premji Foundation, writing stories for social change.

Other stories by Purusottam Thakur
Editor : Sarbajaya Bhattacharya

Sarbajaya Bhattacharya is a Senior Assistant Editor at PARI. She is an experienced Bangla translator. Based in Kolkata, she is interested in the history of the city and travel literature.

Other stories by Sarbajaya Bhattacharya
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli