మేము ఆలస్యంగా వెళ్లాము. “గణపతి బాల యాదవ్ రెండుసార్లు ఈ ఊరి వైపు, మీకోసం వచ్చాడు.” అన్నాడు సంపత్ మోరే, శిరగావ్ లోని మా జర్నలిస్ట్ మిత్రుడు. “అతను రెండు సార్లు తిరిగి అతని స్వంత ఊరు రామపుర్ కి వెళ్ళిపోయాడు. ఇక మూడోసారి మీరు చేరారు అని చెబితే వస్తాడు.” ఈ రెండు ఊర్లు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. గణపతిదేవ్ సైకిల్ మీదే ఈ దూరం అంతా ప్రయాణిస్తాడు. కానీ మూడు సార్లు వచ్చివెళ్లడమంటే 30 కిలోమీటర్లు సైకిల్ మీద తిరగడమే, అది కూడా మే నెల మధ్యలో, మధ్యాహ్నం పూట, పాడైపోయిన రోడ్డు మీద, పాతికేళ్ల వయసున్న పాత సైకిల్ మీద. ఇక ఆ సైకిల్ నడిపే మనిషి వయసు, 97 ఏళ్ళు.
మహారాష్ట్ర లోని సాంగ్లీ జిల్లా లో కడేగావ్ బ్లాక్ లో శిరగావ్ లో ఉన్న మోరే తాతగారింట్లో మధ్యాహ్న భోజనానికి సిద్ధపడుతుండగా, గణపతి బాల యాదవ్ అలవోకగా తన సైకిల్ మీద వచ్చేశాడు. అంత దూరం ఎండలో అతన్ని రప్పించినందుకు నేను చాలా క్షమాపణలు కోరాను కానీ అతను అర్థం కానట్లు నా వైపు చూశాడు. “పర్లేదు”, అని మెత్తని స్వరంలో, చక్కని చిరునవ్వుతో అన్నాడు. “నేను నిన్న మధ్యాహ్నం విటాలో ఒక పెళ్లికి వెళ్లాను. అక్కడకి కూడా నా సైకిల్ మీదనే. నేను అలానే తిరుగుతాను, ” రామాపూర్ నుండి విటాకు వెళ్లిరావడం అంటే 40 కిలోమీటర్ల దూరం సైకిల్ నడిపినట్లు. పైగా ముందు రోజు వాతావరణం ఇంకా వేడిగా, ఇంచుమించుగా 45 డిగ్రీల సెల్సీయస్ దాకా ఉంది.
“ఒకటి రెండు సంవత్సరాల క్రిందట ఈయన 150 కిలోమీటర్ల దూరం లో ఉన్న పాంథర్ పూర్ కి సైకిల్ పై వెళ్లి వచ్చాడు.” అన్నాడు సంపత్ మోరే. “ఇప్పుడు అంత దూరాలు వెళ్లడం లేదు.”
అతను కొరియర్ పని చేసేవాడు. అంతేగాక గణపతి బల్ యాదవ్ సతారా జిల్లా, షెనోలి లో జరిగిన గొప్ప రైలు లూటి బృందంలో ఒకడు
1920లో జన్మించిన గణపతి యాదవ్, 1943లో బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్య్రం ప్రకటించిన మహారాష్ట్రలోని సతారాలోని ప్రతి సర్కార్ లేదా తాత్కాలిక, సాయుధ విభాగమైన తూఫాన్ సేన (సుడిగాలి ఆర్మీ) ర్యాంకుల్లో స్వాతంత్య్ర సమరయోధుడు. ప్రతి సర్కార్ దాదాపు 600 (లేదా అంతకంటే ఎక్కువ) గ్రామాలను తన ఆధీనంలో ఉంచుకుంది. అతను బ్రిటిషువారికి వ్యతిరేకంగా తూఫాన్ సేన తిరుగుబాటులలో పాల్గొన్నాడు. "నేను కొరియర్‌గా పనిచేశాను, అడవులలో దాక్కున్న విప్లవకారులకు సందేశాలు, భోజనం తీసుకు వెళ్ళేవాడిని" అని ఆయన చెప్పారు. ఇటువంటి ప్రమాదకరమైన ప్రయాణాలు ఆయన నడిచే చేసేవారు, ఆ తరవాత కొన్నాళ్ళకు ఆయన సైకిల్ పై ప్రయాణించడం మొదలుపెట్టారు.
గణపతి ఒక ఇప్పటికి సేద్యం చేసే ఒక రైతు కూడా. ఈ మధ్య రబి కాలంలో, అతని అరెకరం నేలలో 45 టన్నుల చెరకుని పండించాడు. అతనికి ఒకప్పుడు 20 ఎకరాలుండేవి కానీ అవి అతని పిల్లలకు ఎప్పుడో పంచేశాడు. అతనున్న చోటనే అతని పిల్లలకు మంచి ఇళ్లు ఉన్నాయి. కానీ గణపతి యాదవ్ భార్య 85 ఏళ్ళ వత్సల, ఇప్పటికి గృహిణి బాధ్యతలు వదలకుండా వంటచేసి, ఇల్లు శుభ్రం చేసుకుంటుంది, వారిద్దరూ నిరాడంబరమైన ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా వారి ఇంటి మధ్య గదిలోనే ఎక్కువగా ఉంటారు. మేము ఆయనింటికి వెళ్ళినప్పుడు వత్సల వేరే ఊరు వెళ్ళింది.
గణపతి నిరాడంబరత వలన అతని పిల్లలకు స్వాతంత్య్ర పోరాటంలో అతని పాత్ర గురించి ఇటీవలే తెలిసింది. అతని పెద్దకొడుకు నివృత్తి పొలంలో పెరిగాడు కానీ 13 ఏళ్లకు బంగారు పని నేర్చుకోవడానికి తమిళనాడులో ఈరోడ్డుకు, ఆ తరవాత కోయంబత్తూర్ కు వెళ్ళాడు. “స్వాతంత్య్ర పోరాటంలో ఆయన పాత్ర గురించి నాకసలు ఏమి తెలీదు”. అన్నాడతను. “నాకు కూడా జీడీ బాపు లాడ్(ప్రతి సర్కార్ లోని గొప్ప నాయకుడు) మా నాన్న ధైర్యసాహసాల గురించి తెలుసా అని అడిగినప్పుడే అర్థమైంది.” బాపు లాడ్ తన గురువు అని చెప్తాడు గణపతి యాదవ్. “అతనే నాకు అమ్మాయిని చూసి పెళ్ళిచేసింది,” అన్నాడు. “ ఆ తర్వాత ఆయన్ని నేను షెట్కరి కాంగర్ పక్ష(భారతీయ రైతులు కార్మికుల పార్టీ)లో అనుసరించాను. ఆయన చివరి రోజుల వరకు ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాను.”
“నేను 7వ తరగతి లో ఉన్నప్పుడు, మా స్నేహితుడి తండ్రి, మా నాన్న ధైర్యసాహసాలు గురించి నాకు చెప్పారు,” అన్నాడు మహాదేవ్, అతని మరో కొడుకు. “ఆ సమయంలో అదేం పెద్ద గొప్ప విషయం కాదులే అన్నట్టు ఉన్నాను. అంటే- ఆయన బ్రిటిష్ సైనికులన్నీ, ఆఫీసర్లని ఏమి చంపలేదుగా అనుకున్నట్టున్నాను. ఆ తర్వాతే ఆ చేసిన పనులు ఎంత ముఖ్యమైనవో అర్ధమైంది.”
అతను సాధారణంగా కొరియర్ పని చేసేవాడు. కానీ గణపతి బల్ యాదవ్, 1943లో సతారా లోని షెనోలిలో, తూఫాన్ సేనను కనుగొన్న క్యాప్టిన్ భావు అనే బాపు లాడ్ నాయకత్వం వహించిన అతి గొప్ప రైలు లూటీ చేసిన బృందంలో ఒకడు
“రైలు మీద దాడి జరిపే నాలుగు రోజుల ముందు మేము ట్రాకుల మీద రాళ్లను పేర్చాలి అని చెప్పారు.”
ఈ దాడి చేసేవారికి బ్రిటిష్(బొంబాయి ప్రెసిడెన్సీ) జీతాలు పట్టుకెళ్తున్నారని తెలుసా? “మా నాయకులకు ఈ విషయం తెలుసు. ఇందులో పని చేసే వారు (రైల్వేస్ లోను ప్రభుత్వం లోనూ) ముందే సమాచారం ఇచ్చారు. మాకు మాత్రమే మేము రైలుని లూటీ చేస్తున్నప్పుడే తెలిసింది.”
ఎంతమంది దాడి చేశారు?
“ఆ సమయం లో ఎవరు లెక్కపెట్టారు? కొద్దీ నిముషాల్లోనే మేము చాలా రాళ్లు, బండరాళ్లు ట్రాకులమీద పడేశాము. తర్వాత మేము రైలు ఆగినప్పుడు దాని చుట్టూ చేరాము. లోపలున్న ప్రయాణీకులు కనీసం కదలడం కానీ ఎదురు దాడి చేయడం కానీ చేయలేదు. ఇది మేము బ్రిటిష్ వారికి వ్యతిరేకంగానే చేశాము గాని, డబ్బుల కోసం కాదు.”
అటువంటి మిలిటెంట్ కార్యాల మధ్య, గణపతి బల్ యాదవ్ కొరియర్ పాత్ర పోషించడం కూడా క్లిష్టమైనది. “నేను మన నాయకులు అడవిలో తలదాచుకున్నప్పుడు వారికి భోజనం పట్టుకెళ్ళేవాడిని. నేను వాళ్లని రాత్రుళ్లు వెళ్లి కలిసి వచ్చేవాడిని. సాధారణంగా నాయకుడితో పాటు 10-20 మంది ఉండేవారు. బ్రిటిష్ ప్రభుత్వం వీరిపై కనిపిస్తే కాల్చివేత ఆర్డర్ జారీ చేసింది. మేము తెలియని దీర్ఘమైన దారుల గుండా చుట్టూ తిరిగి వెళ్లేవాళ్లం. లేదంటే పోలీసులు మమ్మల్ని కాల్చేసేవారు.”
మేము మా ఊరిలో పోలీసులకు సమాచారాన్ని అందించేవారిని శిక్షించేవాళ్ళం. ఆయన ప్రతి సర్కార్ , అనే మాట ‘ పాత్రి సర్కార్’ గా ఎలా మారిపోయిందో చెప్పారు. మరాఠి లో పాత్రి అంటే కర్ర. “మాకు ఇలాంటి పోలీస్ ఏజెంట్లు ఉన్నారని తెలియగానే, అతని ఇంటిని చుట్టుముట్టేవాళ్లం. మేము ఆ సమాచారం ఇచ్చినవాడిని, అతని అనుచరుడిని ఊరి బయటకు తీసుకువెళ్లేవాళ్లం.”
“మేము అతని రెండు చీలమండలాల మధ్యలో ఒక కర్రను పెట్టి కట్టేసేవాళ్లం. ఆ తరవాత అతనిని నిలువునా తిరగేసి పైకి వేలాడదీసి అతని అరిపాదాల మీద కొట్టేవాళ్లం. అతని శరీరంలో ఇంకే భాగాన్ని ముట్టుకునేవాళ్లం కాదు. అరిపాదాలు మాత్రమే. అతను మామూలుగా నడవడానికి రోజులు పట్టేది. “ఇది చాలా బాగా పనిచేసేది. అందువలనే వీరికి పాత్రి సర్కార్ అన్న పేరు వచ్చింది. “ఆ తరవాత అతనిని మేము అతని అనుచరుడు వీపు మీదకెక్కించి వెనక్కి పంపేసేవాళ్లం.
“మేము బెల్వడే, నెవారి, తడ్సర్ లో ఇటువంటి శిక్షలు విధించాము. తడ్సర్ లో నానాసాహెబ్ అనే ఒక పోలీస్ ఇంఫార్మెర్ ఒక పెద్ద బంగ్లా లో ఉండేవాడు. ఒక అర్థరాత్రి మేము అతని ఇంటికి వెళ్లాము. అక్కడ ఆడవాళ్లు మాత్రమే నిద్రపోతున్నారు. దూరంగా ఒక ఆడామె ఒక మూల ఒళ్ళంతా కప్పుకుని పడుకుని ఉంది. ఎందుకీమె వేరేగా పడుకుంది? ఎందుకంటే అది నానాసాహెబ్ కాబట్టి. మేము ఆ కప్పుకునే దుప్పటితోనే అతనిని ఎత్తుకుని వచ్చేశాము.”
నానాపాటిల్ (ప్రతి సర్కార్ అధికారి), బాపు లాడ్ ఆయన హీరోలు. “నానాపాటిల్, ఎంత గొప్ప మనిషి! పొడుగ్గా, భారీగా, భయం లేకుండా ఉండేవాడు. ఎంత గొప్ప స్ఫూర్తినిచ్చే ఉపన్యాసాలు ఇచ్చేవాడు! అతన్నిఇక్కడ చాలామంది గొప్పవారు ఇంటికి పిలిచేవారు, కానీ ఆయన చిన్నఇళ్ల వాళ్ళ దగ్గరే ఉండేవాడు. ఆ పెద్దవారిలో బ్రిటిష్ వారికి సమాచారం అందించేవారు ఉండేవారు.” నాయకులు వారిని ప్రభుత్వానికి భయపడొద్దని చెప్పేవారు. మేమంతా సంఘటితమై పోరాటం లో ఇంకా ఎక్కువ మంది చేరితే, మనకు మనమే బ్రిటిష్ వారినుండి స్వేచ్ఛను సంపాదించుకోవచ్చని చెప్పేవారు. గణపతియాదవ్ తో పాటుగా అతని ఊరిలో 100-150 మంది తూఫాన్ సేన లో చేరారు.
అయినా గానీ, ఆయన మహాత్మా గాంధీ గురించి విన్నాడు కానీ చూడలేదు. “నేను ఆయన్ని ఎప్పుడూ కలవలేదు. ఒకసారి జవహర్లాల్ నెహ్రు ని చూశాను, ఎస్. ఎల్ కిర్లోస్కర్ (పారిశ్రామికవేత్త) ఆయన్ని ఈ ప్రాంతానికి తీసుకు వచ్చినప్పుడు. మేమంతా భగత్ సింగ్ గురించి చాలా విని ఉన్నాము.”
గణపతి బాల యాదవ్ ఒక రైతు కుటుంబంలో పుట్టాడు, అతనికి ఒక చెల్లి మాత్రమే ఉంది. అతని చిన్నప్పుడే అతని తల్లిదండ్రులు చనిపోయారు, అందువలన పిల్లలిద్దరూ బంధువుల ఇంటిలో పెరగవలసి వచ్చింది. “నేను 2-4 ఏళ్ళ వరకు బడికి వెళ్లాను, ఆ తరవాత పొలాల్లో పనిచేయడం మొదలుపెట్టాను.” అతని పెళ్లి తరవాత, అతను తన తల్లిదండ్రుల పాడైపోయిన ఇంటికి మారిపోయి వారికున్న చిన్న పొలాన్ని సాగుచేయడం మొదలుపెట్టాడు. అతని చిన్నప్పటి ఫోటోలు అసలు లేవు, ఎందుకంటే అప్పటికి అతనికి ఫోటోలు తీసుకునే ఆర్థిక వసతి లేదు.
ఏదేమైనా, అతను చాలా కష్టపడి పని చేశాడు, 97 ఏళ్లు వచ్చినా కూడా ఇంకా పని చేస్తూనే ఉన్నాడు. “నేను బెల్లం ఎలా తయారు చెయ్యాలో నేర్చుకుని ఈ జిల్లాలోని ఊర్లలో అమ్మేవాడిని. అలా సంపాదించిన డబ్బుని పిల్లల చదువుకు ఖర్చుపెట్టాను. ఆ తరవాత నేను నా బెల్లం వ్యాపారాన్ని కట్టిపెట్టి, పొలం మీద పెట్టుబడి పెట్టాను. నెమ్మదిగా నా పొలం విస్తరించింది.”
కానీ గణపతి యాదవ్ ఈ రోజుల్లో రైతులు ఎలా అప్పుల పాలవుతున్నారో చూసి ఖేదపడుతున్నాడు. “మనకు స్వాతంత్య్రం వచ్చింది, కానీ మనం కావాలనుకున్నవి జరగడం లేదు.” ప్రస్తుతపు ప్రభుత్వం, ఇదివరకటి అన్యాయంగా వ్యవహరించే ప్రభుత్వాలకంటే ఘోరంగా ఉందని ఆయన చెప్పాడు. “తరవాత వారేం చేయబోతున్నారో ఇక చెప్పే అవసరమే లేదు”, అన్నాడు.
అతని కొరియర్ పని ఎక్కువగా నడకతోనే సాగినా, గణపతి బల్ యాదవ్ 22 ఏళ్లకు సైకిల్ నడపడం నేర్చుకున్నాడు. అదే తరవాత అతని అండర్ గ్రౌండ్ పనికి ముఖ్య సాధనమైంది. “ఈ సైకిల్ మా కాలంలో ఒక కొత్త వింత.” తన ఊరిలో దీని సాంకేతికత గురించి దీర్ఘ సంభాషణలు సాగేవి అంటాడు. “దీనిని నడపడం నేను స్వంతంగా నేర్చుకున్నాను. బోల్డన్ని సార్లు కింద పడ్డాను.”
సాయంత్రమవుతోంది . ఈ 97 ఏళ్ళ మనిషి పొద్దున్న 5 గంటలకు లేచి ఇంకా చురుకుగానే ఉన్నాడు. అతను గంటలు గంటలు తన పని గురించి అలిసిపోకుండా ఉత్సాహంగా మాట్లాడాడు. కానీ ఒకసారి మాత్రం కనుబొమలు ముడి వేశాడు. నేను, ఆయన సైకిల్ కొని ఎన్నేళ్లయింది అని అడిగాను. “ఇదా? 25 ఏళ్ళు అయుంటుంది. దీనికి ముందు దానిని 50 ఏళ్లు ఇంకొకటి వాడాను, కానీ దాన్ని ఎవరో దొంగతనం చేశారు.” అని బాధగా చెప్పాడు.
మేము బయలుదేరబోతుండగా, ఆయన నా చేతులు రెండు పట్టుకుని నాకు ఏదో ఇవ్వాలని ఒక్క నిముషం ఆగమని చెప్పి, ఇంటి లోపలికి మాయమయ్యారు. అక్కడ చిన్న గిన్నె తీసుకుని, కుండను తెరిచి, అందులో గిన్నెను ముంచారు. ఆయన బయటకు వచ్చి నాకు తాజా పాలను ఒక కప్పులో పోసి ఇచ్చారు. అవి నేను తాగేసాక, ఆయన నా చేతులను మళ్లీ గట్టిగా పట్టుకున్నారు, ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. నా కళ్ళు కూడా నిండుకుంటున్నాయి. ఇక మాట్లాడానికి ఏ అవసరము లేదు. మేమిద్దరం కలవడం మా ఇద్దరకీ ఎంత గొప్ప విషయమో, ఎంత తక్కువసేపు కలుసుకున్నా, అద్భుతమైన ఆయన జీవిత చక్రంలో నేనూ ఒక భాగం కాగలిగాను.
సంపత్ మోర్, భరత్ పాటిల్, నమితా వైకర్, సంయుక్త శాస్త్రి- వారి విలువైన సూచనలకు చాలా ధన్యవాదాలు.
అనువాదం: అపర్ణ తోట